Nov 02,2023 22:32

ప్రజాశక్తి-కాకినాడ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ పేర్కొన్నారు. గురువారం ఆమె సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డితో కలిసి కాకినాడ సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కమిషనర్‌ సిహెచ్‌.నాగ నరసింహారావు, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసిపి నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు హాజరయ్యారు. తొలుత రూ.కోటీ 30 లక్షల వ్యయంతో సాలిపేట బాలికోన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎంపీ, ఎంఎల్‌ఎలు ప్రారంభించారు. అనంతరం జగన్నాథపురంలోని మహిళా డిగ్రీ కళాశాలలో రూ.50 లక్షల ఎంపీ నిధులు, రూ.30 లక్షల కార్పొరేషన్‌ నిధులతో నిర్మించిన పింక్‌ టాయిలెట్‌, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. 23వ డివిజన్‌లో రూ.2 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్‌ వారధి నుంచి పెనుగుదురు వంతెన వరకు రూ.3 కోట్లతో నిర్మించనున్న ఆర్‌ అండ్‌ బి రహదారి మరమ్మతు పనులను ప్రారంభించారు. కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ అభివద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీసుకొచ్చిన పాలనా సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో నాడు-నేడు పథకం ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. గడపగడపకూ ప్రభుత్వంలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు 23, 24,25 డివిజన్లకు చెందిన ప్రజలు మంచినీటి సమస్యను తమ దృష్టికి తీసుకు వచ్చారని, సమస్య పరిష్కారంలో భాగంగా రూ.రెండు కోట్ల వ్యయంతో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణం చేపట్టామన్నారు. మూడు నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్‌ చివరి నాటికల్లా కాకినాడ నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు ఇనుకొండ పట్టాభిరామయ్య, రాగిరెడ్డి బన్నీ, నల్లబిల్లి సుజాత, మీసాల దుర్గాప్రసాద్‌, మీసాల శ్రీదేవి, ఎంజికె.కిషోర్‌, సంగాని నందం, వెలమల మల్లేశ్వరరావు, రోకళ్ల సత్యనారాయణ, చెవ్వాకుల రాంబాబు, కార్పొరేషన్‌ ఎస్‌ఇ సత్య కుమారి, ఇఇ వెంకట్రావు, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పథ్వీ చరణ్‌ పాల్గొన్నారు.