ప్రజాశక్తి - సీతానగరం : వైసిపి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం కుంటుపడిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు అన్నారు. మండలంలోని లచ్చయ్యపేట వద్ద భవిష్యత్తు గ్యారెంటీ బస్సు యాత్ర సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్‌సిఎస్ సుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో వేలాది మంది రైతులు, కార్మికులు వీధినపడ్డారన్నారు. జిల్లాలో జ్యూట్ పరిశ్రమలు, చక్కెర కర్మాగారాలు మూతపడడంతో అనేక కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. పరిశ్రమలను నిలబెట్టుకొని ఉండాలి తప్ప మూసి వేయడానికి ప్రయత్నించకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాశనం, మోసం తప్ప ఎక్కడా అభివృద్ధి అనేది లేదని విమర్శించారు. రాబోయే కాలంలో తెలుగుదేశం అధికారానికి వస్తే ఎన్‌సిఎస్ ఫ్యాక్టరీని నడిపించే బాధ్యత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సువర్ణముఖి నది వంతెనపై అర్దాంతరంగా ఆగిన నిర్మాణం పనులను, సీతానగరం పిహెచ్‌సి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కళావెంకట్రావు మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. టిడిపి హయాంలో రూ.12 కోట్లు నిధులు మంజూరు చేస్తే ఆ పనులు నేటికీ పూర్తి చేయలేదన్నారు. కొత్తగా నిర్మాణం చేపట్టిన పిహెచ్‌సి పనులు అర్ధాంతరంగా ఆగిపోవడమే కాకుండా నిర్మాణ దశలో ఉన్న భవనం ఎక్కడికక్కడే గోడ బీట్లు వస్తున్నాయని నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని అన్నారు. ప్రభుత్వ విధానం ఈ విధంగా ఉంటే ప్రజా సమస్యలు ఏం పట్టించుకుంటుందని ప్రశ్నించారు భవిష్యత్తులో టిడిపి ప్రభుత్వం వస్తే అన్నింటికీ పరిష్కారం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు ఆర్‌పి భంజ్‌దేవ్, బి.చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ డి.జగదీష్, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు తోయిక జగదీశ్వరి, నాయకులు గర్భాపు ఉదయభాను, గొట్టాపు వెంకటనాయుడు, మండల నాయకులు కొల్లి తిరుపతిరావు, ఆర్.వేణుగోపాలనాయుడు, ఎస్.హరిగోపాలరావు, యు.సూర్యనారాయణ, సర్పంచ్ తెరేజమ్మ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : భవిష్యత్తుకు భరోసా పేరిట టిడిపి నిర్వహించిన ప్రజా చైతన్య బస్సు యాత్ర సోమవారం పార్వతీపురం మండలం నర్సిపురంలో ప్రవేశించింది. నర్సిపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి కిమిడి కళా వెంకట్రావు, మాజీ స్పీకర్ ప్రతిభ భారతి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మార్ నగరంలో టిడిపి హయాంలోని నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను, చిన్న బొండపల్లిపై వెళ్తున్న అసంపూర్ణ జంఝావతి ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్వతీపురం మండలాన్ని సస్యశ్యామలం చేయాల్సిన జంఝావతి కాలువ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని తమ హయాంలో రూ.36 కోట్లతో ఆధునికరించగా, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల కాలువ కూడుకుపోయి కేవలం వేయి ఎకరాలకే పరిమితమైపోయిందని విమర్శించారు. కార్యక్రమంలో అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు జి.సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులు, నాయకులు పాల్గొన్నారు.
జగన్ పరిపాలన దోచుకో.. దాచుకో : అయ్యన్నపాత్రుడు
పార్వతీపురం రూరల్ : ప్రకృతి వనరులన్నీ దోచుకొని దాచుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తూ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. భవిష్యత్తుకు భరోసా, ప్రజా చైతన్య బస్సు యాత్ర సందర్భంగా సోమవారం పార్వతీపురంలో పర్యటించిన ఆయన స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన ఘనత సిఎం జగన్‌దేనిని అన్నారు. ఇసుక, భూములు, యథేచ్చగా దోచుకోవడంతో పాటు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇప్పుడు మద్యమే వ్యాపారం ద్వారా వేలకోట్లు తన సొంత బ్రాండ్లను అమ్ముకుంటూ వెనకేసుకుంటు న్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచించి రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్‌కు ఓటు వేస్తే వారి ఉరి వారే తీసుకున్న చందంగా తయారవుతుందని అన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు జంఝావతి ప్రాజెక్టుకు నిధులు తీసుకొస్తే వాటిని పూర్తిగా ఖర్చు చేయని దుస్థితి నేడు నెలకొందని అన్నారు. సీతానగరం, నారాయణపురం, గెడ్డలుప్పి వంతెనలకు నిధులు మంజూరు చేయించిన ఘనత తమదని, అయితే నాలుగేళ్లలో ప్రస్తుత ఎమ్మెల్యే అలజంగి జోగారావు వాటిని పూర్తిచేయలేక పోయారని, అంతేకాక జగన్ బాటలో నడుస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల భూములు ఆక్రమించుకోవడంతో పాటు పలు దందాలకు పాల్పడుతూ ఆస్తులను కూడబెట్టుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండల పార్టీ అధ్యక్షులతో పాటు పలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు అభిమానులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










