ప్రజాశక్తి -అనకాపల్లి
రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు సంక్షేమ ఫలాలను పూర్తిస్తాయిలో అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండలంలోని సుందరయ్య పేట గ్రామంలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.23.34 లక్షలతో నాడు-నేడు కింద నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని, ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి నిధులు రూ.10.30 లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని మంత్రి ప్రారంభించారు.
అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
మండలంలోని కుంచంగి గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అంబేద్కర్ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, ఎంపిపి గొర్లి సూరిబాబు, అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మర్రిపల్లి శోభ, ఎంపీటీసీ సభ్యుడు రాపేటి వెంకటేశ్వరరావు, వెంకుపాలెం, శంకరం, సుందరయ్యపేట సర్పంచ్‌లు రాపేటి నాగేశ్వరరావు, పసుపులేటి లక్ష్మి రామకృష్ణ, బాధపు తాతారావు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.










