Aug 17,2023 00:08

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు మూరెడు ముందుకు బారెడు వెనక్కి అన్న చందంగా కొనసాగుతున్నాయి. దాదాపు రూ.5 కోట్లతో ఆధునీకరించిన గాంధీ పార్కు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రాజకీయ వివాదాల నడుమ మూణ్ణెల్లుగా అదిగో..ఇదిగో అంటూ వాయిదా వేస్తున్నారు. పి.వి.కె.నాయుడు కూరగాయల మార్కెట్‌ నూతన భవన నిర్మాణ సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రూ.163.61 కోట్ల అంచనాలతో నిర్మించనున్న ఈ పనులకు టెండర్లు ఖరారు కాలేదు. నాలుగున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూగర్భ డ్రెయినేజి పథకం పనులపై కదలిక లేదు. రూ.903.82 కోట్లతో టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ పనులు దాదాపు 55 శాతం పూర్తయ్యాయి. కాంట్రాక్టు సంస్థకు రూ.420.44 కోట్లు చెల్లించామని, ఇంకా రూ.55 కోట్లు చెల్లించాల్సి ఉందని, చేసిన పనులకు సంబంధించి రూ.55 కోట్లు చెల్లిస్తేనే పనులు చేపడతామని కాంట్రాక్టు సంస్థ చెబుతున్నట్లు ప్రజారోగ్య శాఖాధికారులు తెలిపారు.
బృందావన్‌ గార్డెన్స్‌ రూ.2.70 కోట్లతో అసంపూర్తిగా నిర్మించిన నార్ల తాతారావు ఆడిటోరియం నిరుపయోగంగా మారింది. ఐదేళ్లుగా ఈ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆడిటోరియం నిర్మాణం పూర్తి చేయాలంటే ఇంకా రూ.10 కోట్ల అవసరమని, అన్ని నిధులు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. కృష్ణనగర్‌లో మోడల్‌ రైతు బజారు ఏర్పాటుకు 2200 గజాల స్థలాన్ని మార్కెటింగ్‌ శాఖకు కేటాయించినా రైతు బజారును నిర్మించలేదు. అదేస్థలంలో కొనసాగుతున్న మార్కెట్‌లో కనీస సదుపాయాలు లేవు. మరోవైపు రైతులు, వ్యాపారుల నుంచి మార్కెటింగ్‌ శాఖ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. మార్కెటింగ్‌, మునిసిపల్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల రైతు బజారుకు వచ్చే విక్రయ, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో 133 నోటిఫైడ్‌ పేద వాడలున్నాయి. వీటి అభ్యున్నతికి నాలుగేళ్లుగా నిధులేమీ రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మౌలిక సదుపాయాల కల్పన నిధులు విడుదల కాలేదని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ ఇన్నర్‌రింగ్‌ రోడ్డు విస్తరణ పనులు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు ప్రారంభోత్సవం జరిగింది. తరువాత మూడో దశ పనులు చేపట్టాలని ప్రతిపాదించినా పనులు చేపట్ట లేదు. ఈ రహదారి వెంబడి నివశిస్తున్న వారికి నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం వల్ల పనులు జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. గుంటూరులో ఆర్‌యూబిలు, ఆర్‌వోబిల నిర్మాణ ప్రతిపాదనలు కాగితాలకే పరిమతమయ్యాయి. చెత్తసేకరణకు వెయ్యి ఇళ్లకు ఒక ఈ-ఆటో చొప్పున 220 ఈ- ఆటోలు ప్రవేశపెట్టిన కొద్ది కాలానికి కొన్ని వాహనాలు మూలన పడ్డాయి. కొన్ని వార్డుల్లో 63 పాత వాహనాలు ఉపయోగిస్తున్నారు. కొన్ని వార్డులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోతోంది. నూతన కౌన్సిల్‌ ఏర్పడిన తరువాత రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజా ప్రతినిధులు చెబుతున్నా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులు మాత్రం చేపట్టలేకపోతున్నారు.