
ప్రజాశక్తి-అనకాపల్లి
ఎలమంచిలి శాసనసభ్యులు యువి. రమణమూర్తి రాజు మార్గదర్శకంలో జిల్లా కలెక్టర్ నాయకత్వంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలమంచిలి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎలమంచిలి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను ఎమ్మెల్యే రమణమూర్తి రాజు మంత్రి తృష్టికి తీసుకురాగా కలెక్టర్ వాటికి సంబంధించి జరిగిన పనులు, తీసుకోవలసిన చర్యలను గూర్చి అధికారులతో చర్చించి ఆదేశాలిచ్చారు. పూడిమడక జెట్టి, ఎలమంచిలి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అనకాపల్లి -అచ్యుతాపురం రోడ్డు, ఎలమంచిలిలో రైలు ఓవర్ బ్రిడ్జ్, కొండకర్ల ఆవ సుందరీకరణ కార్యక్రమాల కొరకు చేపట్టవలసిన చర్యలను గూర్చి చర్చించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ స్మరణ్ రాజ్, సిపిఓ రామారావు, డిఆర్‌డిఎ పిడి లక్ష్మీపతి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, పంచాయతీరాజ్ ఈఈ వీరునాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రమేష్, డిపిఒ శిరీష రాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి అనంతలక్ష్మి, నియోజకవర్గంలోని అధికారులు పాల్గొన్నారు.