ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనుల్లో ఆశించినంత పురోగతి లేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పర్యటిస్తున్న సందర్భంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారం కోసం ఒక్కో సచివాలయానికి ప్రభుత్వం రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేసింది. సిసిరోడ్లు, గ్రావెల్ రోడ్లు, తాగునీరు, డ్రెయిన్లు, వీధి లైట్లు, కమ్యూనిటీ హాల్సు తదితర పనులకు ఎక్కువగా ప్రతిపాదనలు అందాయి.
గుంటూరు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు 568 ఉండగా రూ.113.60 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు 568 సచివాలయాల్లో 823 పనులకు జిల్లా కలెక్టరుకు ప్రతిపాదనలు ఇచ్చారు. పనులకు ప్రతిపాదనలు అందచేయడం, చేపట్టిన పనులు పూర్తిచేయడంలో ప్రత్తిపాడు, మంగళగిరి నియోజకవర్గాలు బాగా వెనుకబడి ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 62, పశ్చిమలో 53, మంగళగిరిలో 42, పొన్నూరు 117, ప్రత్తిపాడు 10, తాడికొండ 146, తెనాలి 125 పనులు పురోగతిలో ఉన్నాయి. గత ఆరు నెలల కాలంలో గుంటూరు తూర్పు 10, పశ్చిమ 32, పొన్నూరు 12, పత్తిపాడు 10, తాడికొండ 39, తెనాలి 37 పనులు పూర్తయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 555 పనులు చేపడితే 151 పనులు మాత్రమే పూర్తయ్యాయి.12 పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తిరస్కరించారు.
జిల్లాలో చాలా వరకు నామినేషన్ పద్ధతిలో పనులు జరుగుతున్నాయి. గుంటూరులో మాత్రం నామినేషన్ పద్ధతికి కమిషనర్ అంగీకరించలేదు. ప్రజా ప్రతినిధుల వత్తిడి మేరకు రూ.5 లక్షల వరకు నామినేషన్ పద్ధతిపై పనులు చేపట్టేందుకు అనుమతిచ్చారు. దీంతో వైసిపిలోని ద్వితీయశ్రేణి నాయకులు రూ.5 లక్షల లోపు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే టెండరు పద్ధతిలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు రావడం ముందుకు రావడం లేదు. 2018లో టిడిపి ప్రభుత్వం హయాంలో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయనిధి పనులకు డబ్బులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డారు. చాలా మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో నామినేషన్ పద్ధతిపై పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఎమ్మెల్యేలు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇంటింటికి వెళ్లి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉందని ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు గడపగడపకు కార్యక్రమంలో ఆసక్తి చూపకపోవడం వల్ల ప్రతిపాదనలు రావడంలేదని తెలిసింది. జిల్లాలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొన్నినెలలుగా నియోజకవర్గానికి అందుబాటులో లేరు. ఆమె స్థానంలో నియోజకవర్గం ఇన్‌ఛార్జి కత్తెర సురేష్‌కుమార్ ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రత్తిపాడు, మంగళగిరి నియోజకవర్గాలో ఆశించిన స్థాయిలో గడపగడప జరగకపోవడంవల్ల పనులకు ప్రతిపాదనలు అనుమతించ లేదని తెలిసింది. మొత్తంగా రూ.113.60 కోట్లకు గాను జిల్లాలో ఇప్పటి వరకు కేవలం రూ.60 కోట్లకే ప్రతిపాదనలు అందాయని తెలిసింది.










