Jul 21,2023 22:21

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌

వీరఘట్టం: గ్రామాల్లో వివిధ రూపంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అన్నారు. మండలంలోని చిదిమి గ్రామ జంక్షన్‌ వద్ద రూ.కోటీ40 లక్షలతో బిటి రహదారి నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమేపీ అన్ని గ్రామాల్లోనూ బిటి రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవలే కలెక్టర్‌ను కోరగా రూ.6.50 కోట్లు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కలింగ శ్రీకాకుళం- పార్వతీపురం జంక్షన్‌ నుండి చిదిమి మీదగా పివిఆర్‌ పురం వరకు రోడ్డు పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. దీంతో 15 ఏళ్ల గ్రామస్తుల కలనెరవేరనుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని లంక వీధిలో రూ.80 లక్షలతో సిసి రోడ్డు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధిపై అధికారులతో సమీక్ష
అనంతరం స్థానిక కోదండరామ కల్యాణమండపంలో ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రంలోని రహదారి అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా అంబేద్కర్‌ జంక్షన్‌లో ఉన్న అంబేద్కర్‌, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను తొలగించారు. ఇందులో బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని భోగి కామేశ్వరరావు బంగారు షాప్‌ ఎదురుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ నాయకులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు విన్నవించుకున్నారు. అలాగే రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూడా అనువైన చోట ఏర్పాటు చేసుకున్నందుకు అవకాశం కల్పించాలని స్థానిక నాయకులు కోరారు. ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని స్థానిక నాయకులకు వారు సూచించారు. రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయి పైప్‌లైన్‌కు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు జరిపించాలని స్థానిక నాయకులు అధికారులను కోరారు. కార్యక్రమంలో సర్పంచులు దమలపాటి ఉమామహేశ్వరరావు, ఉదయాన జగన్మోహనరావు, పి.గౌరమ్మ, ఎంపిపి డి.వెంకటరమణనాయుడు, జెడ్పీటిసి సభ్యులు జంపు కన్నతల్లి ఉమామహేశ్వరరావు, ఆర్‌ అండ్‌ బి డిఇ గౌరీశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ ఢిల్లీశ్వరరావు, జెఇ పవన్‌, ఎఎంసి ఉపాధ్యక్షులు పి.లక్ష్మణరావు, తహశీల్దార్‌ సిహెచ్‌ సత్యనారాయణ, ఎంపిడిఒ జయంతి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.