ప్రజాశక్తి - భీమడోలు
భీమడోలులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ట్రైనీ కలెక్టర్ పూజా తిరుమని సంతృప్తివ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ పరిపాలన, ఇతరఅంశాలపై శిక్షణకు భీమడోలు వచ్చిన ఆమె రెండో రోజు శనివారం భీమడోలు పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. గ్రామపంచాయతీ చేపట్టిన పారిశుధ్య నిర్వహణ, ఇతర కార్యక్రమాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వెలిబుచ్చారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని పలు వివరాలు అడిగితెలుసుకున్నారు. కేంద్రం నిర్వహణ తీరు ఇతరులకు ఆదర్శంగా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆమె ఆరోగ్య కేంద్రంలోని వివిధ అంశాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం నిర్వహణ బాగుందని, రోగులకు, ఇన్ పేషెంట్లకు అందుతున్న సేవల గురించి రోగులను అడిగితెలుసుకున్నారు. ల్యాబ్ నిర్వహణ, రక్తపరీక్షలు చేసే విధానం, ఆరోగ్య కేంద్రం నియమ నిబంధనలకు అనుగుణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎన్.ఠాగూర్, ఎంపిటిసి, ఎం.జాన్సన్ పాల్గొన్నారు.










