Sep 30,2023 00:37

సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ మనోహర్‌నాయుడు

ప్రజాశక్తి-గుంటూరు : నగరంలో అభివృద్ధి పనుల నిర్వహణకు టెండర్‌ పొందిన కాంట్రా క్టర్లు నిర్దేశిత గడువులోపు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ మేయర్‌ ఛాంబర్‌లో నగరంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులపై ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులు స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు నిర్వహించాలన్నారు. కాంట్రాక్టు దక్కించుకొని నిర్దేశిత సమయంలోపు పనులు ప్రారంభించని పనుల వివరాలు తెలుసుకొని అందుకు గల కారణాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్లు మాట్లాడుతూ ఇప్పటికే పూర్తి చేసిన పలు అభివృద్ధి పనుల తాలూక బిల్లులు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని కోరగా, స్పందించిన మేయర్‌ అభివృద్ధి పనులు పూర్తి చేసిన వాటికి ప్రాధాన్యతా క్రమంలో బిల్లులు ఇప్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనులు జరిగే సమయంలో సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని, పనుల్లో నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్‌పై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్‌ఇ భాస్కరరావు, ఇఇ సుందరరామిరెడ్డి, డిఇఇలు, ఎఇలు పాల్గొన్నారు.