పాలకవర్గ సమావేశంలో కౌన్సిలర్ల మండిపాటు
డీసెంట్ ఇచ్చిన 29వ వార్డు కౌన్సిలర్
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో తమపై వివక్షత కనబరుస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన మున్సిపల్ పాలకవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండాలోని అంశాలపై చర్చించారు. 29వ వార్డు కౌన్సిలర్ అయినాల వెంకట రమణమూర్తి మాట్లాడుతూ తన వార్డులో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఒక్కపని కూడా చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టర్ మరోచోట కౌన్సిల్ తీర్మానం చేయకుండా పనులు పూర్తి చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో 27వ వార్డులో రోడ్డు ఉన్న ప్రాంతంలోనే మళ్లీ రోడ్డు నిర్మించడానికి టెండరు ఆమోదించాలని కౌన్సిల్ ముందుకు తీసుకురావడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఇప్పటికే రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతానికి బదులు మరోచోట అభివృద్ధి చేయొచ్చని తెలిపారు. ఈ క్రమంలో 27వ వార్డులో రోడ్డు నిర్మాణం కోసం ప్రవేశ పెట్టిన అంశాన్ని రద్దు చేయాలని కోరుతూ ఛైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మికి డీసెంట్ అందించారు. కౌన్సిల్ సభ్యుల తీర్మానం లేకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. 27వ వార్డు కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ తనకు తెలియకుండా తనవార్డులో రోడ్డు వేసిన చోటే మరోసారి రోడ్డు వేసేందుకు సిద్ధమవడం సరికాదన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతూ అవసరం ఉన్న చోట నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందువల్ల 29వ వార్డు కౌన్సిలర్ ఎవిఅర్.మూర్తి అందించిన డీసెంట్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. అలాగే వైస్‌ఛైర్మన్ కంచర్ల వాసవిరత్నం మాట్లాడుతూ స్థానిక కౌన్సిలర్ ప్రమేయం లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడం సరికాదన్నారు. తన వార్డులో ఒక చోట రోడ్డు నిర్మాణం చేపడుతున్న విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. మరో కౌన్సిలర్ ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ అధికారులు కౌన్సిల్ సభ్యులకు గౌరవం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పన్నుల బకాయిలు, కాంట్రాక్ట్ కమిటీ సమావేశాల వివరాలు తనకు ఇవ్వాలని కోరగా అధికారుల తీరు సరిగా లేదని వాపోయారు. అలాగే తన వార్డులో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ రాయితీని సద్వినియోగం చేయాలని విద్యుత్ ఎఇని కోరారు. వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, డ్రెయినేజీలు నిర్మించాలని పలువురు కౌన్సిలర్లు సమావేశంలో కోరారు. ఆనంతరం పట్టణంలో మాస్టర్ ప్లాన్ కోసం జరుపుతున్న సర్వేకు సహకరించాలని టిపిఒ జగదీష్ కౌన్సిలర్లను కోరారు. మున్సిపల్ కమిషనర్ భవానిప్రసాద్ మాట్లాడుతూ పన్ను అధికంగా ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైస్‌ఛైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కో ఆప్షన్ సభ్యులు వెంప ఐజాక్, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.










