Aug 23,2023 21:33

మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గోవర్ధన్‌రెడ్డి

రాజంపేట అర్బన్‌ ; రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో అభివద్ధి పనులలో అధికారులు జాప్యం చేస్తే సహించేది లేదని జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాజంపేట ఆర్‌డిఒ కార్యాలయంలో రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల అభివద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేలు, నాయకుల సహకారంతో అధికారులు క్షేత్ర స్థాయిలో పెండింగ్‌ పనులు పరిశీలించి నాయకులు, అధికారులు సమన్వయంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కుంటి సాకులు చెప్పి పనులు జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులపైన ప్రజల నుంచి ఫిర్యాదులు రాకూడదని సూచించారు. స్పందన, జగనన్నకు చెబుదాం వంటి కార్యక్రమాలలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. జిల్లా స్థాయిలో నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అధికారులు, నాయకులు కషి చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గ పరిధిలో గడపగకు కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి ప్రజా వినతులను స్వీకరించడంలో విజయవంతం అయ్యారని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు కూడా స్వీకరించి ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చేస్తామని తెలియజేశారు. సమీక్షా సమావేశానికి ముందుగా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి కార్యాలయంలో పలువురు వైసిపి నాయకులు మంత్రి కాకానిని కలిసి పులమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి నియోజకవర్గ సమస్యలపై చర్చించి వినతి పత్రాలు అందజేశారు. సమీక్షా సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, రాజంపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కలెక్టర్‌ గిరిష, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.