మండల సమావేశంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి
ప్రజాశక్తి-పద్మనాభం : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి కె.రాంబాబు అధ్యక్షతన మండల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో పెండింగ్‌లో ఉన్న పనులు, సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తంశెట్టి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుకావాలంటే ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయం, సహకారం ఎంతో అవసరమన్నారు. మండలానికి 396 ఇళ్లు మంజూరైనా, నేటికీ వాటిలో అనేక ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంపై ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుంటే రద్దయ్యే అవకాశం ఉన్నందున లబ్ధిదారుల వద్దకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి వెంటనే పనులుప్రారంభించి, పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను ప్రశ్నించి, త్వరితగతిన వాటిని చేపట్టడం ద్వారా మార్చి ఒకటో తేదీనాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు చేపట్టలేని స్థితి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వెంకటాపురంలోని యాతవాని చెరువు దురాక్రమణపై అధికారులు, నేతలు పరిశీలన చేయకపోవడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంకటాపురంలో గొర్రెలు, మేకలు మృత్యువాతతో పెంపకందారులు నష్టపోతున్నారని స్థానిక సర్పంచ్ కర్రిరమణ సమావేశం దృష్టికి తేగా, దీనిపై పశువైద్యాధికారి మహేష్ వివరణను ఎమ్మెల్యే ముత్తంశెట్టి కోరారు. ఆ గ్రామంలోని జీవాలకు గతంలో చేసిన బీమా గడువు ముగిసిపోయిందని, కొత్తగా ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయాల్సి ఉందని డాక్టర్ మహేష్ వివరించారు. ఉదయం పదిన్నర గంటలకు సమావేశం నిర్వహిస్తామని ప్రకటించి, మధ్యాహ్నం రెండుగంటలకు ప్రారంభించడంతో పలువురు అధికారులు గైర్హాజరయ్యారు. సమావేశంలో జెడ్‌పిటిసి సుంకర గిరిబాబు, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ రాధ పాల్గొన్నారు.










