ప్రజాశక్తి-యంత్రాంగం
పిఎం.పాలెం : జివిఎంసి 7వ వార్డు పరిధి మధురవాడ వాంబే కాలనీలో సుమారు రూ.43.05 లక్షలతో పార్కు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మలతో కలిసి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలనీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమస్యలపై ఒక్కొకటిగా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్ విజయనిర్మల మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన సాగుతుందన్నారు. కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ, పార్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వాంబే కాలనీ గృహాల మరమ్మత్తులకు అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత, సత్యనారాయణ, 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, పిల్లా వెంకటరావు, వార్డు వైసిపి అధ్యక్షుడు పోతిన శ్రీను, నాయకులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా సూరిబాబు, పోతిన హనుమంతు, గాదె రోసిరెడ్డి, గుంటుబోయిన సంజీవ్, మొజ్జడ రమణమూర్తి, ముందుండి రాజేశ్వరి, కొండపల్లి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆనందపురం : అనందపురం మండలం మామిడిలో పంచాయతీ దబ్బందలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. దబ్బందలో అంగన్‌వాడి భవనానికి, మామిడిలోవలో రూ.15.74 లక్షలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీలకతీతంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సర్పంచ్ బలిరెడ్డి మల్లికార్జునరావు మాట్లాడుతూ, పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రెయిన్లు, కుళాయిల ఏర్పాటుకు పంచాయతీ ద్వారా నిధుల అవకాశం కల్పించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు రావడంలేదని, పరిశీలించాలని కోరారు.
తాగునీరు, డ్రెయిన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని మామిడిలోవ పంచాయతీలో నివసిస్తున్న మన్నెపాలెం వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు బాగు చేయాలని కోరారు. ఈ సమస్యలు రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని ఎంపిడిఒ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్, జడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, ఎంపీపీ శారద ప్రియాంక, వైస్ ఎంపీపీ పాండ్రంకి శ్రీను, బొట్ట రామకృష్ణ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, గండిగుండం సర్పంచ్ జి.శ్రీను, గ్రంథాలయ మాజీ చైర్మన్ మణిశంకర్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ డోల.దేముడు, మామిడిలోవ పంచాయతీ వైసిపి అధ్యక్షులు బల్రెడ్డి మహేష్, ఎంపిడిఒ లవరాజు, తహశీల్దార లోకవరపు రామారావు, హౌసింగ్ ఏఈ లోకనాథం, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










