Aug 25,2023 22:07

మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
అరసవల్లి సూర్యనారాయణ స్వావి ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి అవసరమైన పక్కా ప్రణాళికను రూపొందించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. పెద్దపాడులోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం చర్చించారు. అరసవల్లి మున్సిపల్‌ స్కూల్‌ పక్కన ఉన్న 2.77 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించారు. ఈ స్థలాన్ని కొన్నేళ్లుగా వృథాగా ఉంచారని, ఆక్రమణలకు గురికాకుండా ఈ భూమిని సంరక్షించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ శాఖ నుంచి ఈ భూమిని నగరపాలక సంస్థకు అప్పగింత పూర్తయిందని, ఈ స్థలంలో పలు నిర్మాణాలను చేపట్టేందుకు డిజైన్‌ను రూపొందించిన కన్సల్టెన్సీ ప్రతినిధులు వాటిని మంత్రి ధర్మానకు చూపించారు. నిర్మాణాలకు అవసరమైన మార్పులను సూచించారు. ఈ స్థలంలో ఓపెన్‌ థియేటర్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, యోగా థియేటర్‌, ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటుతోపాటు పక్కనే ఉన్న చెరువును కూడా అభివద్ధి చేయాలని మంత్రి ధర్మాన సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక తయారు చేయాలని నగరపాలక సంస్థ అధికార్లకు ఆదేశించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, మున్సిపల్‌ ఇంజినీర్‌ గంగాధర్‌, వైసిపి నాయకులు చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.