Nov 25,2022 23:39

వినతులు స్వీకరిస్తున పిఒ, అధికారులు

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌:గడప గడపకు మన ప్రభుత్వంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరిత గతిన పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ స్పష్టం చేసారు. జెసి జె.శివ శ్రీనివాసు, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, డిఆర్‌ఒ బి. దయానిధితో కలిసి వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి శుక్రవారం స్పందనలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు ప్రతి శుక్రవారం నిర్దిష్టమైన సమయానికి స్పందనకు హాజరు కావాలన్నారు. కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి అభివృద్ధిపై అంచనాలు ఎక్కవగా ఉంటాయని గిరిజనుల ఆకాంక్షల మేరకు పనులు పూర్తి చేయాలని సూచించారు. స్పందన సమస్యలు పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో డివిజన్‌ పరిధిలో రోజుకి 55 వేల మందికి పని కల్పించాలన్నారు. తాగునీటి సమస్యలు లేకుండా జల్‌ జీవన్‌ మిషన్‌ లో మంజూరు చేసిన పనులు పూర్తి చేయాలన్నారు.
స్పందనలో 95 ఫిర్యాదులు
స్పందనలో 95 ఫిర్యాదలును స్వీకరించారు. హుకుంపేట మండలం గన్నేరుపుట్టు సర్పంచ్‌ ఎస్‌.కృష్ణారావు మదుము గ్రామానికి మినీ అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ తులబడ గ్రామస్తులు కె.శంకరరావు, వి.చంద్రమ్మ తదితరులు కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని కోరారు. కొయ్యూరు మండలం మూలపేట, కుమ్మర్ల, జాజులబంధ, ధారగెడ్డ, పాలమామిడి, హర్లుబంద గ్రామాలకు మెటల్‌ రోడ్డు మంజూరు చేయాలని జెడ్‌ పిటిసి వారా సూకరాజు, కె.చిట్టిబాబు వినతిపత్రం అందజేసారు. కొయ్యూరు మండలం గొట్టెలపాడు వాగుపై వంతెన నిర్మాణానికి గతేడాది మంజూరు చేసారని, నిర్మాణం చేపట్టాలని డి.రమేష్‌ వినతి పత్రం సమర్పించారు. చింతూరుకు చెందిన భరణి వికలాంగుల పింఛను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, ఎపిఒ విఎస్‌ ప్రభాకరరావు, ఇఇలు డివిఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్‌, డిఎల్‌ పిఒ పిఎస్‌ కుమార్‌, ఆర్‌ అండ్‌ బి ఇఇ బాలసుందర బాబు, పిఆర్‌ ఇఇ కొండయ్యపడాల్‌, జిసిసి డిఎం కె.పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల గడువు పొడిగింపు
పాడేరు టౌన్‌: పెట్రోల్‌ బంకుల్లో సర్వీసు ప్రొవైడర్ల దరఖాస్తుల స్వీకరణ ఈనెల 26వ తేదీ వరకు పొడిగించామని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కొంత మంది గిరిజన అభ్యర్థుల అభ్యర్ధన మేరకు గడువు పొడిగించామని చెప్పారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐటిడిఎ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.