ప్రజాశక్తి-కలెక్టరేట్ : జివిఎంసి 27వ వార్డు పరిధిలోని శ్రీనగర్, ద్వారకానగర్ తదితర ప్రాంతాలలో రూ.93.15 లక్షల వ్యయంతో తారు రోడ్లు, సిసి కల్వర్టులు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వార్డు కార్పొరేటర్ గొలగాని వీరరావుతో కలిసి మేయర్ గొలగాని హరి వెంకటకుమారి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతోందని తెలిపారు. వార్డులోని ప్రధాన సమస్యలైన తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం తదితర సమస్యలపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శివప్రసాద్, పర్యవేక్షక ఇంజినీర్ వేణుగోపాల్, కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాస్, జివిఎంసి సిబ్బంది, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై మేయర్ ఆగ్రహం
వార్డులో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించనందున శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య పనులపై ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను మందలించారు.










