Oct 13,2023 21:07

సమావేశంలో మాట్లాడుతున్న వైస్‌చైర్మన్‌ ఇండుపూరు గున్నేష్‌

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా అజెండాలో పొందుపర్చిన 11 అంశాలను మున్సిపల్‌ ఉద్యోగి సురేష్‌ చదివి వినిపించారు. అంశాలలో పలు వార్డులకు సంబంధించి 9 అభివృద్ధి పనులను, రెండు రెవెన్యూ విభాగాల అంశాలను కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జీరో అవర్‌లో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఇండుపూరు గున్నేష్‌ మాట్లాడుతూ పాలకవర్గం ఏర్పడిన ఈ రెండున్నర ఏళ్లలో తమ వార్డుకు రూ.3 లక్షల 85వేలు అభివృద్ధి పనులను మంజూరు చేయడం గొప్ప శుభ పరిణామమని, ఈ అజెండా కాపీని లామినేషన్‌ చేసుకుని భద్రపరచుకుంటానని మున్సిపల్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలపడంతో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆ సందర్భంలో ఆశ్చర్యానికి గురవ్వడం విశేషం. 14వ వార్డు టిడిపి కౌన్సిలర్‌ ద్వారపూరెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ పలు వార్డుల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే పట్టణ శివారులో ఉన్న డంపింగ్‌ యార్డ్‌లో వ్యర్ధాలు ప్రధాన రహదారిపైకి రావడంతో వాహదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఫిర్యాదు చేశారు. దీనికి కమిషనర్‌ స్పందిస్తూ డంపింగ్‌ యార్డ్‌ లోపల సిసి రోడ్డు నిర్మాణం జరుగుతుందని, పనులు పూర్తయిన వెంటనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. సమావేశంలో వైస్‌చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, ఇండుపూరు గున్నేష్‌, పాలకవర్గ కౌన్సిల్‌ సభ్యులు, మున్సిపల్‌ రెవెన్యూ అధికారి దిబ్బ రూబెన్‌, టిపిఒ పి.కనకారావు, డిఇ పి.కిరణ్‌ కుమార్‌, ఎఇ జి.ఆనంద్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.