Sep 19,2023 23:43

సమావేశంలో మేయర్‌, సభ్యులు

ప్రజాశక్తి - గుంటూరు : గుంటూరు నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం కృషి చేస్తుందని నగర మేయర్‌, స్థాయిసంఘ అధ్యక్షులు కావటి శివనాగ మనోహర్‌ నాయుడు అన్నారు. నగర పాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం మేయర్‌ ఛాంబర్‌లో మంగళవారం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. అన్ని డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన అంచనాలు, అధికారుల ప్రతిపాదనలపై ఆయా విభాగాధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ పరిశీలనలో గుర్తించిన ప్రజా సమస్యలను డివిజన్ల వారీగా, ప్రాధాన్యత క్రమంలో చేస్తున్నామని చెప్పారు. సిసి రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు. విలీన గ్రామాల్లోనూ సిసి డ్రెయిన్లు, రోడ్ల ఏర్పాటుకు ప్రత్యేక ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సమావేశంలో స్థాయి సంఘ సభ్యులు ఎస్‌.శ్రీనివాసరావు, షేక్‌ మహమూద్‌, కె.గురవయ్య, ఎం.శ్రీవల్లి, పి.అంబేద్కర్‌, ఎస్‌.వెంకటరమణాదేవి, కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, శ్రీనివాసరావు, ఎస్‌ఇ భాస్కర్‌, ఎంహెచ్‌ఒ భానుప్రకాష్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నగరాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలని స్టాండింగ్‌ కమిటీకి నూతనంగా ఎన్నికైన షేక్‌ మహమూద్‌, సంకూరి శ్రీనివాసరావు, శ్యామల వెంకట రమణాదేవి, కాండ్రుకుంట గురవయ్య, మల్లెబోయిన శ్రీవల్లి, పాపతోటి అంబేద్కర్‌ను మేయర్‌ సత్కరించారు.