యుపిహెచ్‌సి వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష
ప్రజాశక్తి - కాకినాడ
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యుపిహెచ్‌సిలు) పరిధిలో ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య పథకాలు పటిష్టంగా అమలు చేసేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఆర్.రమేష్‌తో కలిపి 23యుపిహెచ్‌షిల వైద్యాధికారులతో సమావేశం నిర్వహిచారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు అందుకున్న వారి నుంచి ఎఎన్‌ఎంల సమగ్రమ సమాచారం సేకరించడం, పాఠశాలల్లో కిశోర బాలికలకు రక్త హీనత పరీక్షలు, గర్భిణులకు రక్త హీనత పరీక్షలు, ఎన్‌సీడీ ఆరోగ్య ఐడీలు, హైరిస్క్ గర్భిణీల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ, టీకాల కార్యక్రమం తదితరాలపై సమీక్షించారు. ఆరోగ్య పథకాలు విజయవంతంగా అమలుచేసేందుకు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలన్నారు. యుపిహెచ్‌సిల పరిధిలో వైఎస్సార్ కంటి వెలుగు, రెగ్యులర్ ఓపీ సేవలతో పాటు ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డా. పి.రాధాకష్ణ, డీఐవో డా. ఐ.ప్రభాకర్, యూపీహెచ్‌సీల వైద్యాధికారులు హాజరయ్యారు.
సరిహద్దురాళ్ల రీ సర్వే పూర్తి చేయాలి
జిల్లాలో సమగ్ర రీ సర్వే ప్రక్రియలో భాగంగా చేపట్టిన సరిహద్దు రాళ్ళ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ jఔతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ రెవెన్యూ, సర్వే ఇతర శాఖల అధికారులతో కలిసి కాకినాడ అర్బన్ మండలం, మేడలైన్ గ్రామం వద్ద సరిహద్దు రాళ్లు పాతే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకానికి సంబంధించి జిల్లాలో తొలి దశలో 121 గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. రీ సర్వేలో భాగంగా భూమి సరిహద్దు గుర్తింపు పనులు పూర్తైన నేపథ్యంలో ల్యాండ్ పార్శీల్ మ్యాప్ (ఎల్పీఎం) ద్వారా రైతువారి, ప్రభుత్వ పోరంబోకు భూములలో సరిహద్దు రాళ్లు వేసే ప్రక్రియను చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. సరిహద్దు రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సరిహద్దు రాళ్ల ప్రక్రియను సవ్యంగా నిర్వహించాలని ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కాకినాడ ఆర్‌డిఒ బివి రమణ, ఎడి సర్వే బి.లక్ష్మీనారాయణ, అర్బన్ తహశీల్దార్ సీతా పతిరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
నాడు నేడు రెండో దశ పనులను జూన్ 12 నాటికి పూర్తి చేయాలి
మన బడి నాడు నేడు కింద చేపట్టిన రెండో దశ పనులను జాన్ 12 నాటికి పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ, మరమ్మతు పనుల పురోగతిపై విద్యా, సమగ్ర శిక్ష, ఆర్‌డబ్ల్యూఎస్, ఎపిఎం ఎస్‌ఐడిసి, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో నాడు నేడు రెండో దశ కింద సుమారు 882 అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లోను, 14 జూనియర్ కళాశాలలోను నిర్మాణ పనులు చేపట్టామ న్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్, బాలికల మరుగుదొడ్లు, తాగు నీరు, విద్యుదీకరణ ఇలా పది అంశాల్లో పనులు ప్రారంభించే విధంగా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ పనులన్నీ రానున్న జూన్ 12 నాటికి పూర్తి చేసే విధంగా కృషి చేయాలని కలెక్టరు అధికారులకు సూచించారు. సమావేశంలో డిఇఒ కెఎన్‌విఎస్ అన్నపూర్ణ, సమగ్ర శిక్ష ఇఇ నటరాజన్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఎపిఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఈవిఎంల భద్రతకు పటిష్ట చర్యలు
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవిఎం, వివిప్యాట్ గోదామును మంగళవారం ఉదయం కలెక్టర్ కతికా శుక్లా రెవెన్యూ, ఎన్నికల, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి తనీఖి చేశారు. ఈవిఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలిం చారు. అనంతం కలెక్టరు కృతిక మాట్లాడుతూ ఈవిఎంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ప్రతి నెల ఈవిఎం, వివి ప్యాట్ గోదామును నిశితంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని కలెక్టరు వివరించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్‌డిఒ బివి రమణ, జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి ఎన్. సురేంద్ర ఆనంద్, కాకినాడ పట్టణం తహశీల్దార్ సీతాపతిరావు, కాకినాడ పట్టణ ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ సీహెచ్.లక్ష్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.










