Sep 08,2023 22:56

సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌, ఇతర సభ్యులు, అధికారులు

ప్రజాశక్తి-గుంటూరు : జెడ్పీ నిధులతో మండలాల్లో కేటాయించిన పనుల పురోగతిని ఎప్పటికప్పుడూ తెలియ చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. శుక్రవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన ఆమె ఛాంబర్‌లో 1, 2, 4, 7 స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అప్పుడే కొత్త పనులు మంజూరు చేయటానికి అవకాశం ఉంటుందన్నారు. కానీ మంజూరైన పనులు పురోగతి ఏవిధంగా ఉందో అసలు సమాచారం ఉండట్లేదన్నారు. మూడేళ్ల క్రితం అప్పగించిన పనులు కూడా పూర్తి కానివి ఉన్నాయన్నారు. గుంటూరు జెడ్పీటిసి తుమ్మల సుబ్బారావు మాట్లాడుతూ జొన్నలగడ్డ జెడ్పీ హైస్కూల్‌కు ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఫిరంగిపురంలోని కోనేరులో నీరు ఉపయోగించుకునేందుకు వీలుగా కోనేరులో జంగిల్‌ తీసివేయించాలని ఆ మండల జెడ్పీటిసి కోరారు. గత సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించినా మంజూరు కాలేదన్నారు. శిధిలావస్థలో ఉన్న నుదురుపాడు నీళ్ల ట్యాంక్‌ స్థానంలో కొత్తది నిర్మించాలని కోరారు. ఆగస్టు 15 సందర్భంగా జెండా ఆవిష్కరణకు తనను ఆహ్వానించినా తాను అక్కడికి వెళ్లేలోపే జెండా ఆవిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొమ్మూరు-కాకుమాను రహదారిని తీవ్రంగా దెబ్బతిన్నదని, మరమ్మత్తులు చేయించాలని కాకుమాను జెడ్పీటిసి కోరారు. వైస్‌ చైర్మన్‌ శొంటిరెడ్డి నర్సిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 3వ స్థాయి సంఘంలో వ్యవసాయం గురించి, తెనాలి జెడ్పీటిసి పిల్లి ఉమాప్రణతి అధ్యక్షతన జరిగిన 5వస్థాయి సంఘంలో స్త్రీ, శిశు సంక్షేమం గురించి, వైస్‌చైర్‌పర్సన్‌ బత్తుల అనురాధ అధ్యక్షతన జరిగిన 6వ స్థాయి సంఘంలో సాంఘిక సంక్షేమం గురించి చర్చించారు.