ప్రజాశక్తి-హిందూపురం :హిందూపురం పురపాలక సంఘ ఆధీనంలో ఉన్నా కూరగాయాల మార్కెట్ నాడు శిథిలం పేరుతో అప్పటి పాలకులు తొలగించారు. అయితే ఇప్పటి పాలకులకు, అధికారులకు అది కల్పవృక్షంగా మారింది. మార్కెట్ నిర్మాణం పూర్తి అయింది. అయితే దాని అభివృద్ధి కోసం కోట్లాది రూపాయాల ప్రజా ధనాన్ని అందరు కలిసి ఆవిరి చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు బస్టాండ్ ఆవరణంలో ఉన్న వాణిజ్య భవనాల వారు ఎండ తగలకుండా వేసుకున్న సన్‌సైడ్ రేకులను ఆక్రమణల పేరుతో తొలగించి, తిరిగి వాటిని వేయడానికి లక్షల రూపాయలను మున్సిపల్ శాఖ వారు వెచ్చిస్తున్నారు.
గత ప్రభుత్వం రూ.23కోట్లతో నూతన మార్కెట్ నిర్మాణం చేపట్టింది. ఆ సమయంలో పనులు పూర్తి స్థాయిలో కాక పోయినా ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దీనిని హడావుడిగా ప్రారంభించారు. 2019 ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో మార్కెట్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో మార్కెట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చివరికి మార్కెట్ స్థలంలో తొలుత వాణిజ్య సముదాయ భవనాల పనులను పూర్తి చేసి, బహిరంగ వేలం పాట నిర్వహించి గదులను కేటాయించారు. అనంతరం మార్కెట్ గదులకు వేలం పాట నిర్వహించారు. ఆ సమయంలో కూరగాయల వ్యాపారులు సిండికేట్‌గా మారి గదులను కైవసం చేసుకున్నారు. అయితే హోల్‌సేల్ వ్యాపారులకు మార్కెట్ ఆవరణంలో స్థలాన్ని ఆ సమయంలో కేటాయించలేదు. మార్కెట్ ఆవరణంలో స్థలాన్ని కేటాయించాలని హోల్ సేల్ వ్యాపారులు మున్సిపల్ అధికారులకు, పాలకులకు కోరారు. మార్కెట్ పక్కన ఉన్న బస్టాండ్‌లో ఆక్రమణకు గురైన స్థలాన్ని మున్సిపల్ శాఖ స్వాధీనం చేసుకుని హోల్‌సేల్ వ్యాపారులకు కేటాయిండానికి అవసరమైన చర్యలు తీసుకుంది. మార్కెట్ గదులను కేటాయించి, స్థలాలను ఎలా కేటాయిస్తారని పాలకవర్గం ప్రశ్నించింది. ఈనేపథ్యంలో మున్సిపల్ పాలక వర్గంలో ఓ ప్రజాప్రతినిధి భర్త కీలకంగా వ్యహరించి, మార్కెట్ వ్యాపారులతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడి, పాలక వర్గానికి, అధికారులకు ముడుపులు అందించడంతో స్థలాలను కేటాయించారు. అదే స్థలంలో మరిన్ని ముడుపులు తీసుకుని షెడ్ల నిర్మాణాలను చేయించడానికి మున్సిపల్ సాధారణ నిధుల నుంచి దాదాపు రూ.30లక్షలు వెచ్చించడంతో పాటు మార్కెట్‌లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం మరో రూ.3లక్షలు కేటాయించారు. ఇది చాలదన్నట్లు గత నెల బస్టాండ్ ఆవరణంలో మున్సిపల్ వానిజ్య భవనాలను అద్దెకు తీసుకున్న వారు ఆక్రమణకు పాల్పడ్డరని అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఇది జరగక ముందు ఓ ప్రజా ప్రతినిధి భర్త వాణిజ్య భవన యజమానులను డబ్బులు డిమాండ్‌చేశారని వారు ఇవ్వక పోవడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆక్రమణల పేరుతో వాణిజ్యసముదాయాల ముందు ఉన్న రేకులను తొలగించారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఈ రేకులను గత నెల తొలగించి, ఈ నెల అదే వాణిజ్య భవనాల ముందు రేకులతో షెడ్ల నిర్మాణానికి మున్సిపల్ నిధులు మంజూరు చేయించుకున్నారు. రూ. 30లక్షలు కేటాయించి పనులను ప్రారంభించారు. గదుల యజమానులు తనకు డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కారణంతో ఆ ప్రజా ప్రతినిధి ఈ తతంగానికి తెరతీశారన్న ఆరోపణలు వినపించాయి. ఈ రెండు పనులను తాను చెప్పిన గుత్తేదారులకు కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినల్లు సమాచారం. ఎలాగైన పనులు తాను చెప్పిన గుత్తేదారులకే కేటాయిస్తారని, బినామి పేరుతో పనులు తానే చేయాలని ముందే నిర్మాణాలకు అవసరమైన ఐరన్ ఇతర సామాగ్రిని మార్కెట్‌లో నిల్వ చేశాడు. అయితే అధికారులు నిబంధనల మేరకు తాము పనులు కేటాయిస్తామని చెప్పడంతో ఆ ప్రజాప్రతినిధి భర్త పనులు అడ్డుకోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగి పోయినాయి. ఇది ఇలా ఉండగా మార్కెట్ పేరుతో మున్సిపల్ సాధారణ నిధులన్నీ వృథా చేస్తున్నారని కొంత మంది కౌన్సిలర్లు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏకంగా కార్యాలయానికే వెళ్లి నిధులు ఎలా కేటాయిస్తారని ఇంజనీర్లపై గొడవలకు దిగుతున్నారు. మొత్తానికి మార్కెట్ నిర్మాణం నుంచి గదుల కేటాయింపు వరకు అధికారులు, పాలకులు, మార్కెట్ వ్యాపారులు కలిసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుని, ఒక ప్రత్యేక అధికారిని నియమించి విచారణ చేయిస్తే పెద్ద అవినీతి బయటపడే ఆవకాశం ఉంది.










