Nov 04,2023 22:52

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి గత నాలుగేళ్లున్నరేళ్లుగా సుందర నగరంగా తీర్చుదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు, డ్రయిన్లు సమానంగా నీటి ప్రవాహం జరుగుతున్న తీరు మాత్రం కన్పించడం లేదు. వేసిన రోడ్లపైనే డబుల్‌ రోడ్లు వేస్తు, నిర్మించి రెండు సంవత్సరాలు కాకముందే దాని స్థానంలో మరో మురికి కాలువలను నిర్మిస్తున్నారే తప్ప పలుచోట్ల ఏళ్ల తరబడి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కనీస పట్టింపు లేకుండా ఉండడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తున్నామంటూ చెప్పుకునే నాయకులు ఆయా వార్డుల్లో సంవత్సరాల తరబడి కనీస రోడ్లు లేక, చిన్నపాటి వర్షం పడితే మురికినీరు ఇళ్ల ముందు వచ్చి చేరి రోగాల పాలవుతున్నారు. తమ గోడు పట్టించుకోండని వేడుకుంటున్నా అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. సాక్షాత్తు ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ వార్డుల్లో పర్యటించిన సమస్యలు పరిష్కారానికి అధికార యంత్రాంగం చొరవ చూపించడం లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి రహదారులపై డివైడర్లు, పార్కుల అభివృద్ధికి మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మాత్రం చర్యలు చేపట్టడం లేదు.
చినుకుపడితే చిత్తడే..
చిన్నపాటి చినుకు పడితే చాలు రాజమహేంద్రవరంలోని అనేక వార్డుల్లో రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల వెంబడి గుంతలు, వర్షపు నీరు ప్రవహించేందుకు మురికి కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి రోడ్లవెంట ప్రయణించాలంటేనే ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. చిన్నపాటి వర్షాలు కురుస్తేనే రోడ్ల వెంట ఉన్న గుంతల్లో నీరు చేరి మడుగులు కడుతున్నాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, మురికివాడలు, శివారు కాలనీల్లో మాత్రం ఈ సమస్య తీవ్రంగా ఏర్పడుతోంది. జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లు మాత్రం అందంగా తీర్చిదిద్దిన అధికారులు తీవ్రంగా సమస్య ఉన్న పలు కాలనీల్లో మాత్రం రోడ్లు వేయకపోవడం, గుంతలు పడ్డచోట్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షాలకు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. కంబాల చెరువు వద్ద పేరుకపోయిన మట్టిని, చెత్తను పూర్తిస్థాయిలో తీయకపోవడంతో మురుగు నీరంతా రోడ్లపై పారుతోంది. పేపర్‌ మిల్లు మొదలుకుని ఆర్యాపురం వరకు చిన్నపాటి వర్షాలకి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. శనివారం కురిసిన చిన్నపాటి వర్షానికే లలిత నగర్‌, హుకుంపేట, బాలాజీ నగర్‌, తదితర ప్రాంతాల్లోనూ మురుగునీరు దాటికి తీవ్ర దుర్గంధం, ఈగలు, దోమలతో ప్రజలు అవస్థలు పడ్డారు.
అభివృద్ధి పేరుతో రూ.కోట్ల ఖర్చు
రాజమహేంద్రవరంలో అభివృద్ధి పేరుతో వందల కోట్లు ఇటీవల కాలంలో వెచ్చించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కంబాల చెరువు పార్క్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నగరాభివృద్ధిని కీర్తించిన విషయం విదితమే. నగరంలో సెంటర్‌ జైలు రోడ్డు, ఏవి అప్పారావు రోడ్డు, జెఎన్‌ రోడ్లలో మాత్రమే కొంతమేర అభివృద్ధి పరిమితమైంది. అనేకచోట్ల రహదారులు విస్తరించకుండా డివైడర్లు ఏర్పాటు చేశారు. పెరుగుతున్న రద్దీ తగినట్లుగా రహదారులు లేకపోవడం, డివైడర్లు ఏర్పాటు చేయడంతో బస్‌ కాంప్లెక్స్‌ ఏరియా, ఏవి అప్పారావు రోడ్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన వీధుల్లో ఒకటైన శ్యామల నగర్‌, స్టేడియం రోడ్డు ప్రధాన రైల్వే స్టేషన్‌ ఏరియా, బస్‌ కాంప్లెక్స్‌, కంబాల చెరువు, లలిత నగర్లలో మురికి కాల్వల ఆధునీకరణకు నోచుకోవడం లేదు ఈ ప్రాంతాలలో దశాబ్దాల క్రితం నిర్మించిన కాలువలు ఉన్నాయి. నగరంలో పెరిగిన జనసాంద్రత అనుగుణంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. అయినా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇలా అనేక సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.