అభివృద్ధి నిరోధకంగా బిజెపి: సిపిఎం
ప్రజాశక్తి - తిరుపతి సిటి
తిరుపతి నగరంలో బిజెపి అభివృద్ధి నిరోధకంగా తయారైందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఓ ప్రకటనలో విమర్శించారు. తిరుపతి నగరాభివద్ధికి టీటీడీ బడ్జెట్లో ఒక శాతం నిధులు కేటాయించడాన్ని తప్పుపడుతూ, పారిశుధ్యానికి కార్మికులను కేటాయించడాన్ని విమర్శిస్తూ బిజెపి చేసిన ప్రకటనపై స్పందించారు. చిన్న ప్రాంతంగా ఉన్న తిరుపతి లాంటి నగరంపై రోజుకు రెండు లక్షల మందికి పైగా ప్రజలు వస్తుంటే ఎంతటి ఒత్తిడి ఉంటుందో శాస్త్రీయ పరిశీలన చేస్తే అర్థమవుతుందని అన్నారు. టీటీడీ కేంద్రంగా అభివృద్ధి చెందిన తిరుపతి నగరం టీటీడీ ఆధారంగా మరింత బలపడడం వల్ల ప్రజలకు, భక్తులకు మేలు జరుగుతుందని అన్నారు. మాధవసేవే మానవసేవగా ప్రతినిత్యం ప్రచారం చేస్తున్న టిటిడి చెంతన మానవులకు చేస్తున్న మేలుపై బిజెపి అమానవీయంగా వ్యవహరిస్తోందన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం తదితర ప్రజోపయోజనమైన పనుల నిర్వహణకు టీటీడీ నిధులు వినియోగించాలని యాక్ట్ 30/1987 లో స్పష్టంగాఉన్నా బిజెపి నేతలు ఎందుకు యాగీ చేస్తున్నారో తిరుపతి ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. గతంలో గరుడ వారధి విషయంలోనూ, భూగర్భడ్రైనేజీ సందర్భంగానూ అడ్డుపడ్డారని గుర్తు చేశారు. తిరుమల వెంకన్నపై బిజెపి భక్తులకు విశ్వాసం ఉంటే తిరుమల లడ్డుపై, కాటేజీలపై వేస్తున్న జీఎస్టీ ని రద్దు చేయాలని కోరారు.బిజెపి అధికారంలోకి వచ్చాక తొమ్మిదిన్నర ఏళ్లలో తిరుమల అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి సాయం చేశారా? అని ప్రశ్నించారు. రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతంలో తిరుమల ఆలయం ఓ వరంలా తిరుపతి ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంటే, బిజెపి నేతలు అడ్డగోలు వాదనలకు అర్థం ఏమిటి? అని ప్రశ్నించారు. టీటీడీ నిధులు అనవసరంగా కళ్యాణ మండపాలు, ఇతర రూపాలలో దేశమంతటా విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే మాట మాట్లాడని పెద్ద మనుషులు, తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేసే నిధులపై వితండవాదం చేయటం తిరుపతి ప్రజలను అవమానించడమేనన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ టీటీడీ నిధులతో నిర్మాణాలు ఎందుకు చేపట్టాలని ప్రశ్నించారు. ప్రతి టిటిడి బోర్డులో బిజెపి సానుభూతి పరులు, బిజెపి ప్రజా ప్రతినిధులు ఉన్నారని వారు నిర్ణయాలు చేస్తారు, వీరు బయట యాగీ చేస్తారు? ఇది ఎవరిని మోసగించడానికని ప్రశ్నించారు. బిజెపి తప్పుడు విధానాలను తిరుపతి నగర ప్రజలు ముక్త కంఠంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు










