May 21,2023 17:38

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

అభివృద్ధి లేదనడం హాస్యాస్పదం
- బహిరంగ చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే
- బిసికిఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సవాల్‌
ప్రజాశక్తి - బనగానపల్లె

       యువగళం పాదయాత్రలో లోకేష్‌, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్‌ రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొనడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం బనగానపల్లెలో జరిగిన బహిరంగ సభలో సిఎం జగన్మోహన్‌ రెడ్డిని, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని నారా లోకేష్‌ కమీషన్ల రామిరెడ్డి అని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదివారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. లోకేష్‌ పాదయాత్రలో, బహిరంగ సభలో టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరించాల్సింది పోయి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యేను ఎద్దేవా చేయడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. బహిరంగ సభలో బనగానపల్లె నియోజకవర్గంలో తాను కమీషన్లు తీసుకుంటున్నానని నారా లోకేష్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బిసి జనార్దన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే టిడిపి కార్యకర్తలు చేసిన పనులకు కమీషన్లు తీసుకున్నారని విమర్శించారు. పట్టణంలో మైనారిటీల షాదీఖానాకు బిసి జనార్దన్‌ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చారని నిన్న బహిరంగ సభలో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. ఆయన ఇచ్చిన డబ్బును మళ్ళీ టిడిపికి చెందిన మైనార్టీ నాయకుడు కలాం పేరు మీద విత్‌ డ్రా చేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. డబ్బులు విత్‌డ్రా చేసుకున్న ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని బిసి జనార్దన్‌ రెడ్డికి ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. తాను కమీషన్లు తీసుకున్నానని పదేపదే లోకేష్‌ చెప్పారని, రుజువు చేసే దమ్ము లోకేష్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైసిపి యువ నాయకులు కాటసాని ఓబుల్‌ రెడ్డి, నాయకులు అత్తార్‌ జాహిద్‌ హుస్సేన్‌, బండి బ్రహ్మానంద రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గరుడ దీవెనమ్మ, జడ్పిటిసి లక్ష్మీసుబ్బమ్మ, నాయకులు పాల్గొన్నారు.