అనుకూలించని పరిస్థితులు
సేవాభావంతోనే సర్పంచ్‌గా అవకాశం
ఒక్కటొక్కటిగా సమస్యలు పరిష్కారం
ప్రభుత్వ సహకారం కోసం ఎదురుచూపు
రామవరం సర్పంచ్ ఎర్ర పైడిరాజు
ప్రజాశక్తి- అనందపురం : ఇంజినీరింగ్ పట్టభద్రుడైన యువకుడు, కరోనా కష్టకాలంలో గ్రామస్తులకు ముఖ్యంగా పేదలకు విశేష సేవలు అందించిన సేవాతత్పరుడు. దీంతో ఎటువంటి రాజకీయ నేపథ్యం, పలుకుబడి లేనప్పటికీ, ప్రజాసమస్యల పట్ల అతనికి ఉన్న చొరవ, చిత్తశుద్ధిని చూసి, ఇలాంటి వ్యక్తి సర్పంచ్ అయితే పంచాయతీని అభివృద్ధి చేస్తాడని, సమస్యలను పరిష్కరిస్తాడని గ్రామస్తులంతా ఎంతో నమ్మకంగా సర్పంచ్‌గా గెలిపించారు. ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగానే అభివృద్ధిపై తనకున్న తపనతో ముందుకు సాగుతూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒక్కటొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. అతడే... మండల కేంద్రంతోపాటు అభివృద్ధికీ దూరంగా ఉన్న రామవరం పంచాయతీ సర్పంచ్, బిటెక్ పట్టభద్రుడు ఎర్ర పైడిరాజు.
అభివృద్ధికి ఆమడ దూరంలో రామవరం
మండల కేంద్రానికి దూరంలో ఉన్న రామవరం అభివృద్ధిలోనూ వెనుకబడి ఉందని గ్రామ సర్పంచ్ ఎర్ర పైడిరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 1075 మంది ఓటర్లున్న రామవరంలో ప్రధాన సమస్య గండిగుండం హైవే రోడ్డు నుంచి రామవరం వరకు సుమారు ఏడు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా శిథిలమై, ప్రయాణసంకటంగా ఉంది. మరోవైపు ప్రపంచమంతా 5జీ టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతూ, ప్రతి చిన్న విషయానికి బయోమెట్రిక్, ఆన్‌లైన్ సేవలపైనే ఆధారపడుతుంటే, రామవరంలో మాత్రం సాదారణ సెల్‌సిగల్స్ లేక గ్రామస్తులు బయట ప్రపంచానికి దూరంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో సర్పంచ్ కాకముందే పైడిరాజు, ఎయిర్‌టెల్ ఫైబర్ నెట్‌వర్క్ ప్రతినిధులతో మాట్లాడి, అప్పట్లోనే తన సొంత నిధులతో ఫైబర్ నెట్ కనెక్షన్లు రప్పించి, కొంతమేర సిగల్స్ సమస్య పరిష్కరించాడు. దీంతో గండిగుండం రోడ్డుకు వెళ్లి రేషన్‌కు బయోమెట్రిక్, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఫింగర్ ప్రింట్ వేసే పరిస్థితులను నుంచి కొంత ఉపశమనం కలిగించాడు. రామవరం, గంగసాని అగ్రహారం, ఎర్రవానిపాలెం, గోరింట, బంటు మెరక, కొలవానిపాలెం గ్రామాలలో సెల్‌సిగల్స్ లేక పలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నాడు. పంచాయితీ అభివృద్ధికి తగినన్ని నిధులు లేక చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందించి, రామవరం అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్‌తోపాటు, గ్రామస్తులు కోరుతున్నారు.










