Sep 03,2023 23:41

-  ఎమ్మెల్యే బలరాం సహకారంతో అభివృద్ధి పనులు 
- రూ.1.80కోట్లలతో నిర్మాణ పనులు
- అభివృద్దే లక్ష్యంగా పనులు చేస్తున్నామన్న కార్యదర్శి రమేష్ బాబు
ప్రజాశక్తి - చీరాల
ప్రజల మౌళిక అవసరాలు తీరుస్తూ అభివృద్ధి పథంలో వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీ దూసుకుపోతుంది. ప్రజలకు సౌకర్యవంతంగా కావలసిన రోడ్లు, డ్రైన్లు, విద్యుత్తు సౌకర్యంతో పాటు నూతన పైపులైన్‌ నిర్మాణాలను చేపట్టారు. ఇటీవల పనులు పూర్తి చేశారు. ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి శేషయ్య సహకారంతో సుమారు రూ.1.80కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అభివృద్దిలో ఇతర పంచాయతీలకు ఆదర్శంగా కొత్తపేట పంచాయతీ నిలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డబల్ రోడ్డు నిర్మాణాలు, విద్యుత్తు స్తంభాలు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు, సిమెంట్ రోడ్లతో పాటు రోశయ్య కాలనీలో రూ.15లక్షలతో త్రాగునీటి పైపులైను పనులు చేపట్టారు. పంచాయితీ కార్యాలయం నుండి డిఎస్‌పి ఆఫీసులు, టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ వరకు రూ.1 కోటి 80లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. పంచాయతీ సాధారణ నిధులు, 15వ ఆర్ధిక సంఘం నిధుల ద్వారా జెకె అపార్టు మెంట్‌ నుండి బిఎస్ఆర్ ఫంక్షన్‌ హాల్ వరకు, ఎమ్మెల్సీ పోతుల సునీత ఇంటి వద్ద రోడ్డు, ప్రసాద్ నగర్ లో సెయింట్ పాల్స్ వద్ద, రోడ్లు, విద్యట్ లైన్‌లు, డ్రికింగ్ వాటర్, వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ వకుల్ జిందాల్, జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఇన్చార్జి కరణం వెంకటేష్ పలువురు ప్రముఖుల సమక్షంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పంచాయితీ అధికారుల పనితీరును గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.

అభివృద్ధి పైనే దృష్టి : బి రమేష్ బాబు, కొత్తపేట పంచాయతీ కార్యదర్శి
పంచాయతీలో అభివృద్ధి పనులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి 80 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు కార్యదర్శి బి రమేష్ బాబు అన్నారు. ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి, వైసిపి ఇన్చార్జి కరుణం వెంకటేష్ బాబు, మండల ప్రత్యేక అధికారి ఎస్ శేషయ్య, ఇతర అధికారుల సహకారంతో అభివృద్ధి పనులను చేసినట్లు తెలిపారు. విఆర్ఎస్  అండ్ వైఆర్ఎన్ కళాశాల ప్రాంతంలోని ఐటీసీ కాలనీలో రూ.3లక్షలతో నూతన కరెంటు లైన్‌లో వేశామని అన్నారు. వడ్డే సంఘంలో రూ.3లక్షలతో మరొక కరెంటు లైన్ వేసినట్లు తెలిపారు. ప్రధానమైన వీధుల్లో సిసి రోడ్లు నిర్మించామని అన్నారు.