ప్రజాశక్తి - రేపల్లె
రూ.కోటికిపైగా ఎంపి నిధులు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తీసుకొచ్చినట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. జూనియర్ కళాశాల ఆవరణంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ భవన్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఇండోర్ స్టేర్ స్టేడియం నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వంలో స్థానిక నాయకులు ఎన్నో ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు. ప్రధాన రహదారికి దగ్గరలో నిర్మించడానికి అభ్యంతరం వ్యక్తం చేసి ఓ మూలన నిర్మించాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను చేసిన వాగ్దానానికి కట్టుబడి అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. జి ప్లస్ వన్ విధానంలో భవన నిర్మాణం శరవేగంగా జరుగుతుందని అన్నారు. 2009లో తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రేపల్లె తీర ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం పాలిటెక్నిక్ కళాశాలను తీసుకవచ్చినట్లు తెలిపారు. కళాశాల భవన నిర్మాణాలకు నాబార్డ్ నుండి రూ.5కోట్ల రుణాలు మంజూరు చేయించానని చెప్పారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి భవన నిర్మాణాలు వదిలేశారని అన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఆవిర్భవించిన నేపథ్యంలో అభివృద్ది పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైసిపి పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి ఉన్నారు.










