Aug 08,2023 21:09

మండలంలోని మైలపల్లి యానాది కాలనీ

రాయచోటి : మారుమూల పల్లెల్లో నివసించే గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఫలితంగా వారి అభివృద్ధి కుంటుపడుతోంది. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అభివద్ధికి ఆమడ దూరంగా గిరిజనులు ఉన్నారు. గిరిజనుల్లో ఒక తెగగా చెప్పకునే యానాదులు.. ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు అందుకోలేని అనాథలుగా మిగిలిపోవడం చాలా బాధాకరం. గుట్ట, పుట్ట పట్టుకుని పూట గడుపుతున్న యానాదుల ధీనగాద అంతా ఇంతా కాదు. జిల్లాలో సుమారు 25 యానాదులు కాలనీలు ఉన్నాయి. లక్షకుపైగా జనాభా ఉన్నారు. ఆధార్‌ లేక కొందరు, రేషన్‌కార్డు లేక మరి కొందరు మన కోసం పథకాలు ఉన్నాయా అన్న ఆమోమయంలో ఉన్నారు. కనీసం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైనాకైనా వారికి ప్రభుత్వ పథకాలు చేరడం లేదు. యానాదుల పిలలకు ఆధారు కార్డు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకొని, వారిని పాఠశాలల్లో చేర్పించే సామాజిక బాధ్యత లేని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తాయి. అధికారులు నిర్లక్ష్యం ఎక్కువ శాతం కనబడుతోంది. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కథనం..
జిల్లాలోని రైల్వేకోడూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లి, గాలివీడు, రాయచోటి మండలాల్లో యానాదుల కాలనీలు ఉన్నాయి. వారిని అభివద్ధి చేసేందుకు నెల్లూరు జిల్లాలో ఐటిడిఎ ఆఫీసు ఏర్పాటు చేశారు. అక్కడున్న ప్రాజెక్టు అధికారి ఇంత వరకూ యానాది కాలనీలవైపు కన్నెత్తి కూడా చూడలేదు. యానాదులు సమస్యలు పరిష్కరించిదానికి మొగ్గు చూపడం లేదు. యానాదులు వెనుక బడిబాట కారణం ఐటిడిఎ అధికారులే. ఇప్పటికైనా స్పందించి యానాదులకు అభివద్ధి, సంక్షేమ పథకాలు అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని యానాదులు కోరుతున్నారు. ఆధార్‌ కార్డుల కోసం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నివేదికలు పంపినా నెల్లూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చీమ కుటినట్లు కూడా లేదని గిరిజనులు వాపోతున్నారు. యానాదులు కోసం ప్రత్యేక ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని యానాది సంక్షేమ సంఘం వినతి పత్రం సమర్పించినా ప్రాజెక్టు అధికారి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని యానాది నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్‌ కార్డు లేక తమ పిల్లలను స్కూళ్లల్లో కూడా చేర్పంచలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి స్పందించి వెంటనే ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి
యానాదులు ఎక్కువగా ఉన్న రైల్వేకోడూరులో ప్రత్యేక ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. ఐటిడిఎ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి.
- జలకం శివయ్య, జిల్లా అధ్యక్షులు, యానాదులు సంక్షేమ సంఘం. అన్నమయ్య.
కాలనీలు అభివద్ధి చేయాలి
యానాదుల కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఐటిడిఎ నిధులు యానాది కాలనీలో అభివద్ధి కోసం ఖర్చు చేయాలి.
- సికోలి బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు, యానాదుల సంక్షేమ సంఘం, అన్నమయ్య.చిట్వేలు