Oct 03,2023 21:20

టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

 కడప అర్బన్‌ : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభివద్ధి పనులకు రూ.15 వేల కోట్లు జీవోలు ఇచ్చి, 2021కి పూర్తి చేస్తామన్న హామీలు ఏమయ్యాయని, ఇచ్చిన జీవోలు కాగితాలకే పరిమితం అయ్యాయని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ద్వారక నగర్‌ లోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలాఖరులో రిజర్వ్‌ బ్యాంకుకు వెళ్లడం, తెచ్చిన డబ్బులు పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివద్ధి లేదుగానీ, రాష్ట్రంలో 144 సెక్షన్‌, దీక్షలు చేస్తే హౌస్‌ అరెస్టులు వీటికి ఏమాత్రం తక్కువ లేదని ఎద్దేవా చేశారు. అవినీతి తెలియని చంద్రబాబును అక్రమ కేసుతో జైలుకు పంపారని, ఇప్పుడు లోకేష్‌ ను జైలుకు పంపడానికి సిద్ధమయ్యారని చెప్పారు. ఓటమి భయంతో, తిరిగి గెలిచేందుకు ఎంతమంది నేతలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపుతారని ప్రశ్నించారు. టిడిపి నేతలను జైళ్లకు పంపి ఎన్నికల్లో గెలుస్తామనే జగన్‌ రాజకీయ కుట్రలను, ప్రజలు తిప్పి కొడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడి లేదు, పోలవరం, నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న జగన్‌, ఆ ఆలోచన చేయలేదని అన్నారు. అక్రమ అరెస్టులు చేసి, జైళ్లకు పంపి, బయటికి రాకుండా ఉంచేందుకు, ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని ఆరోపించారు. న్యాయం, ధర్మం ఉన్నాయి కాబట్టి, జైలు నుంచి వచ్చిన చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మ రథం పట్టి, అధికారం ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కడప నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాధవి రెడ్డి మాట్లాడుతూ అధినేత చంద్రబాబు సత్యమేవ జయతే, దీక్షకు మద్దతుగా, రిలే దీక్షలు చేపడితే భగం చేయడానికి పోలీసులు ప్రయత్నించారన్నారు. శాంతియుతంగా దీక్షలు నిర్వహిస్తే వైసిపి నేతలకు, పోలీసులకు అభ్యంతరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దీక్షా శిబిరాన్ని తొలగించి, హౌస్‌ అరెస్టులు చేస్తారా అని ఆమె నిలదీశారు. ఎన్ని చేసినా భయపడే ప్రసక్తే లేదని, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వైసిపి దుర్మార్గ పాలన తీరును తెలియ పరుస్తామన్నారు. ఓట్లు వేసి తప్పు చేశామని ప్రజలు గ్రహించారని, వైసిపి ఎమ్మెల్యేను ఇంటికి పంపిస్తారని చెప్పారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ సీమలో పుట్టిన వ్యక్తి ధర్మ యుద్ధమే చేస్తారని, జగన్‌ అధర్మ యుద్ధం చేస్తున్నాడని అనుమానాన్ని వ్యక్తపరిచారు. ఆనాటి బ్రిటిష్‌ పాలనకు, జగన్‌ నిరంకుశ పాలన తీసిపోదన్నారు. కేసులకు, అరెస్టులకు టిడిపి కుటుంబం ఇప్పటికీ ఎప్పటికీ భయపడదని, జగన్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఆయన హెచ్చరించారు.