కిరీటి, డేవిడ్ ఇద్దరూ ఒకే బడిలో చదువుతున్న మంచి స్నేహితులు. కిరీటి బాగా చదివి ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు. డేవిడ్ కూడా బాగానే చదివినా ఆటల మీద ఇష్టంతో వాటిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు. డేవిడ్‌ని కిరీటి ఆటల మీద శ్రద్ధ తగ్గించి, బాగా చదువుకోమని అడిగేవాడు. దానికి డేవిడ్ నవ్వి ఊరుకునేవాడు. ఇద్దరూ పదో తరగతి పాస్ అయ్యారు. డేవిడ్ వాళ్ల నాన్న బ్యాంక్ ఉద్యోగి. హైదరాబాదుకు బదిలీ కావడంతో వెళ్లక తప్పలేదు. డేవిడ్ వెళ్లిపోతున్నందుకు కిరీటి బాధపడ్డాడు. పై తరగతులకు పోతున్న కిరీటిని వాళ్ల అమ్మనాన్నలు బాగా కష్టపడి చదవాలని ఒత్తిడి చేసేవారు. చదువులో పడిపోయిన కిరీటి, డేవిడ్‌ని మర్చిపోయాడు. కాలం గడిచిపోయింది. కిరీటికి సంగీతం అంటే ఇష్టం వున్నా, వాళ్ల నాన్న ఎప్పుడూ చదువు మీదనే ఒత్తిడి చేసేవాడు. దీంతో కిరీటి తన సంగీతం ఆశ వదలుకుని, ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాడు. డేవిడ్ వాళ్ల నాన్న ఎప్పుడు వాడిని చదువులో ఒత్తిడి చేయలేదు. హైదరాబాదు వచ్చాక తన ఆఫీసులో పనిచేసే అతని సలహాతో డేవిడ్‌ని బ్యాట్మెంటెన్ కోచింగ్‌కు పంపాడు. బాగా నేర్చుకున్న డేవిడ్ ఎన్నో బహుమతులు, పతకాలు సాధించడంతో గొప్ప ఆటగాడుగా గుర్తింపు పొందాడు. జాతీయ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకుని, ప్రభుత్వం తరపున ఒలింపిక్స్‌కి వెళ్లి, స్వర్ణ పతకం సాధించాడు. డేవిడ్‌కు వాళ్లనాన్నకు కలిగిన సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. దేశానికి పేరు తెచ్చిన డేవిడ్‌ని అటు ప్రభుత్వం ఇటు మీడియా పొగడ్తలతో, సన్మానాలతో గౌరవించింది. టీవి చూస్తున్న కిరీటికి ఒక్కసారిగా డేవిడ్‌ను చూసి ఆశ్చర్యం, సంతోషం వేసింది. వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ కలవడంతో కిరీటి పాతరోజులు గుర్తుచేసి, డేవిడ్‌తో మాట్లాడాడు. 'ఇన్నాళ్లూ మనం కలవ లేకపోయినా గుర్తు పెట్టుకున్నందుకు సంతోషం. త్వరలో నిన్ను కలుస్తాను!' అన్నాడు. డేవిడ్‌కు ప్రభుత్వం తగిన పారితోషికంతోపాటు ఇంటి స్థలం, ఉద్యోగం వచ్చింది. కిరీటి ఇంటికి డేవిడ్ వెళ్లాడు. ఇద్దరు పాత జ్ఞాపకాలు పంచుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. 'మొత్తానికీ బాగా సెటిల్ అయ్యావు. ఆటల కోసం వెళ్లినప్పుడు ఎన్నో ఊర్లు, ప్రదేశాలు చూడొచ్చు!' అన్నాడు. 'నిజమేరా.. చదువు విషయంలో మా నాన్న నన్ను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. నా ఇష్టాన్ని గుర్తించి, కోచింగ్ ఇప్పించారు. అందుకే ఇంతటివాడినయ్యా అన్నాడు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల అభిరుచిని, ఇష్టాన్ని గుర్తించరు. ఎన్నో డబ్బులు పోసి చదివిస్తారు. వారి ఉద్దేశంలో చదువు ఒక్కటే భవిష్యత్తు. అందుకే మార్కుల కోసం ఒత్తిడి చేస్తారు. ఇంజినీర్లు, డాక్టర్లు బాగా సంపాదిస్తారు.. హాయిగా ఉంటారనే నమ్మం. అందుకే పిల్లల చిన్న చిన్న ఆశలు, కోరికలూ తీర్చకుండా, వారి నైపుణ్యాన్ని గుర్తించకుండా మార్కుల కోసం ఒత్తిడి చేస్తారు. అదే నీలా ప్రోత్సహిస్తే ఎన్నో సాధిస్తారు!' అన్నాడు. 'నిజమే నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా ఇష్టాన్ని మా నాన్న గుర్తించడమే. అందుకే ఎప్పటికైనా కోచింగ్ సెంటర్ పెట్టి, చాలామంది ఆటగాళ్లను తయారు చేయాలన్నదే నా ఆశయం' అన్నాడు.
కంచనపల్లి ద్వారకనాథ్
9985295605