Aug 27,2023 21:33

అభద్రనడుమ కెజిబివి

కెజిబివిలో అభద్రత రాజ్యమేలుతోంది. ఆర్థిక స్తోమతలేని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయల వ్యయంతో కెజిబివి పాఠశాలను నిర్మించారు. రక్షణ గోడ నిర్మాణ పనుల్ని విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. టిడిపి హయాం నుంచి నేటి వరకు ముచ్చటగా రెండు దఫాలుగా ప్రహరీ నిర్మాణ పనులకు అనుమతులు లభించినప్పటికీ అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ఇందుకు మండల కెజిబివి, ఎస్‌ఎస్‌ఎ జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమనే వాదన వినిపిస్తోంది. ఎస్‌ఎస్‌ఎ పిఒ సొంతఇలాఖాలోని కెజిబివి పాఠశాలకు ఏళ్ల తరబడి ప్రహరీకి నిర్మించలేకపోవడం విమర్శలకు ఆస్కారాన్ని కలిగిస్తోంది.

ప్రజాశక్తి - బ్రహ్మంగారిమఠం : కెజిబివి విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. 2008లో మండల కేంద్రానికి అతి సమీ పంలో కోట్లాది రూపాయల వ్యయంతో కెజిబివి పాఠశాలను నిర్మించారు. వందలాది మంది పేద విద్యార్థినులు విదా ్యబ్యాసం చేస్తున్నారు. కెజిబివికి రక్షణ గోడ (ప్రహరీ) లేకపో వడంతో పందులు, పశువులు, విషపురుగుల సంచారానికి నిల యంగా మారింది. పందుల సంచారం గురించి చెప్పాల్సిన పనేలేదు. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. కెజిబివి వెనుకభాగాన జగనన్న ఇళ్లకాలనీ నిర్మితమవుతోంది. కాలనీ నిర్మాణ పనుల పేరుతో తాగుబోతుల సంచారం పరిపాటిగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న ఓ విద్యార్థిని ఘటనలో ఐదుగురు కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అసలు బాధ్యులకు జిల్లా అధికారి రక్షణ లభించిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు లేకుండా పోయింది. విద్యార్థినులు బిక్కు బిక్కుమంటూ విద్యాబ్యాసం సాగించాల్సి వస్తోంది.
పెండింగ్‌లోనే ప్రహరీ పనులు
టిడిపి హయాం నుంచి నేటి వరకు రెండు దఫాలుగా ప్రహరీ నిర్మాణ పనులకు అనుమతులు లభించినప్పటికీ పనులు చేపట్టలేదు. వైసిపి హయాంలో రూ.24 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. నెలల తరబడి ప్రహరీ పనులు చేపట్టడం లేదు. పందులు, పశువులు, తాగుబోతుల సంచారం నేపథ్యంలో ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టడంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. టిడిపి హయాంలో కాంట్రాక్టర్ల మధ్య విభేదాలు, వైసిపి హయాంలో ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టకపోవడానికి కారణాలేమిటో తెలియడం లేదు.
మొద్దునిద్రలో ఎస్‌ఎస్‌ఎ
టిడిపి హయాం నుంచి నేటి వరకు రెండు దఫాలుగా నిధులు మంజూరైనప్పటికీ ప్రహరీ నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. ఇటీవల ప్రహరీ నిర్మాణ పనులకు ఆమోదం లభించినప్పటికీ నిర్మాణ పనులకు వచ్చిన అడ్డంకులేమిటో అధ్యయనం చేసి పరిష్కరించాల్సిన జిల్లా స్థాయి అధికారులు మొద్దునిద్ర పోతున్నారు. ఎస్‌ఎస్‌ఎ పిఒగా జిల్లా స్థాయి అధికారి హోదాలో ఉంటూ సొంతఇలాఖాలోని కెజిబివి పాఠశాల ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడంలో అంతులేని నిర్లక్ష్యం తగదనే ప్రశ్న వినిపిస్తోంది.