ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : తండ్రి అనారోగ్యం, తల్లి మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న 8 సంవత్సరాల ఓ అభాగ్యురాలికి పోలీసులు తమవంతు చేయూతను అందించారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తనవంతుగా రూ. 30వేలు చిన్నారి పేరుమీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. చిన్నారిని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పుట్టపర్తి నియోజకవర్గంలో నల్లమాడ మండల కేంద్రానికి చెందిన లక్ష్మీదేవి, సూర్యనారాయణ దంపతులు నిరుపేదలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. వారికి ఒక కుమార్తె. పేరు స్రవంతి. వయసు8 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఆ నిరుపేద కుటుంబాన్ని విషాదాలు వెంటాడాయి. 3 సంవత్సరాల కిందట సూర్యనారాయణ చెట్టు పై నుండి పడి వెన్నెముక దెబ్బ తినడంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో లక్ష్మీదేవి కూలి పనులు చేసుకుంటూ వచ్చిన కాస్తంత సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తుండేది. ఆమె సంపాదన భర్త వైద్యానికి, కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోయేది కాదు. అయినా అష్ట కష్టాలు పడుతుండేది. ఈ నేపథ్యంలో ఉన్న కష్టాలు చాలవన్నట్లు ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కుటుంబాన్ని నడిపిస్తున్న లక్ష్మీదేవి కూడా ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. ఇక మంచానపడ్డ సూర్యనారాయణ, కుమార్తె 8 ఏళ్ల చిన్నారి స్రవంతి కష్టాలు వర్ణనాతీతమయ్యాయి. ఆ పసిపాప మంచానపడ్డ తండ్రికి సపర్యలు చేస్తూ ఉండిపోయింది. రూపాయి సంపాదనలేదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. వర్షం వస్తే ఆ గుడిసె పూర్తిగా కారుతోంది. దీంతో తండ్రి కూతురు వర్షం వచ్చిన ప్రతిసారి తడిచిపోవాల్సిందే. ఇక చిన్నారి స్రవంతికి ఇరుగుపొరుగువారు ఇచ్చిన బియ్యంతో తండ్రికి వండి పెట్టడం సపర్యలు చేయడమే సరిపోతుంది. పాఠశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. చేతిలో కనీస ఖర్చులకు కూడా చిల్లిగవ్వ లేదు. పాఠశాలకు వెళ్తున్న తోటి చిన్నారులని చూసి తనకు ఆ అవకాశం లేదని కుమిలిపోతుండేది. ఆ చిన్నారి పరిస్థితి, ఆ కుటుంబ దుస్థితిని తెలుసుకొన్న ఎస్పీ మాధవరెడ్డి చలించిపోయారు. వెంటనే స్పందించారు. ఆ అభాగ్యులకు అండగా నిలవాలనుకున్నారు. తక్షణమే ఆ కుటుంబానికి దుస్తులు నిత్యావసరాలు అందజేయాలని నల్లమాడ పోలీసులకు సూచించారు. తనవంతుగా రూ. 30వేలు చిన్నారి పేరున బ్యాంకు లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఆ చిన్నారిని నల్లమాడలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. ఆ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే కాదు కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటామని చాటిచెప్పారు పోలీసులు..










