Aug 22,2021 12:08

బాల్యంలో తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగాడు. నాలుగిళ్లల్లో పనిచేసి యజమాని ఇచ్చిన మిగిలిన పదార్థాలతో పిల్లల కడుపు నింపి, తల్లి పస్తులున్న రోజులను అతను మరచిపోలేదు. చివరకు అన్న తన చదువును త్యాగంచేసి, పనిలోకెళితేగానీ చదువుకోలేక పోయాడు. ప్రస్తుతం న్యాయశాస్త్రం చివరి సంవత్సరం చదువుతున్న కాన్పూర్‌కు చెందిన నితిన్‌కుమార్‌ ఎందరో అభాగ్యులకు అండగా నిలిచాడు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ సుమారు 200 మందికి విద్యను బోధిస్తూ 'శభాష్‌!' అనిపించుకుంటున్నాడు.

   నితిన్‌ తల్లి నాలుగిళ్లల్లో పనిచేస్తే రోజుకు రూ.25 మాత్రమే వచ్చేవి. ఆమె పిల్లల ఫీజు నెలకు రూ.300 అయ్యేది. అంతంత మాత్రం ఆదాయంతో ఆరుగురున్న కుటుంబంలో పిల్లలను చదివించడం అంటే మాటలు కాదు. 'మా నాన్నకు స్థిరమైన ఉద్యోగం అంటూ ఏదీ లేదు. అతి కష్టం మీద స్కూలుకు వెళ్లగలిగినా నోట్‌బుక్స్‌, పెన్సిల్స్‌, పెన్నులు, యూనిఫాం కోసం చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. నాతోటి విద్యార్థులంతా ట్యూషన్‌కు వెళితే నేను మాత్రం ఇంట్లోనే ఉండేవాడిని. నాలా ఏ విద్యార్థి కష్టపడకూడదు అనుకున్నా. అందుకే నర్సరీ నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్స్‌ చెప్పాలి అని నిర్ణయించుకున్నా. మా దగ్గర పాఠాలతో పాటు సంస్కృతం, ఫ్రెంచ్‌, సంగీతం, నృత్యాలనూ నేర్పిస్తాము' అంటున్నాడు నితిన్‌.
 

                                                               ఒకే ఒక్క షరతు

     'మా అన్నయ్య 8వ తరగతిలో చదువు ఆపేసి, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఉద్యోగంలో చేరాడు. పిల్లలను చదివించడం ఎంత ముఖ్యమో విద్యావంతులైన తల్లిదండ్రులకు అవగాహన ఉంటుంది. కానీ మురికివాడల్లోని తల్లిదండ్రులకు అవేమీ పట్టవు. అందుకే చదువు పట్ల వారిలో అవగాహన పెంచాను. పదో తరగతి ముగిసిన తర్వాత పిల్లలకు ఉచితంగా ట్యూషన్‌ చెప్పడానికి ఒకే ఒక్క షరతు మీద ఒప్పుకున్నా. నా దగ్గర ట్యూషన్‌కు వచ్చే ప్రతి విద్యార్థీ తనకన్నా చిన్న తరగతి విద్యార్థులకు తామూ ఉచితంగా విద్యను అందిస్తామని మాట ఇవ్వాలి. 2009లో గంగానది కమలేశ్వర్‌ ఘాట్‌ దగ్గర పిల్లలకు సాయంత్రం ట్యూషన్స్‌ నిర్వహించేవాడిని. 2015లో 'ఘాట్‌ వాలా స్కూల్‌' అని దానికి పేరు పెట్టా. ఆరుబయట ట్యూషన్స్‌ జరపడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు, భక్తుల దృష్టి మాపై పడేది. చాలామంది ఆర్థికంగా సహాయం చేసేవారు' అంటున్నాడు నితిన్‌.
        '2018లో ఒక సాయంత్రం ఇక్కడికి దగ్గరలోని దేవాలయానికి వెళ్లి, వస్తుండగా ఘాట్‌ దగ్గర పిల్లలు చదువుకునేది చూశా. వారి గురించి ఆరా తీశా. నితిన్‌ చేస్తున్న పని నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేనూ స్వచ్ఛందంగా విద్య నేర్పించాలని నిర్ణయించుకున్నా. నేను దీనిని సేవగానో, ఆర్థికంగా ఎదగడానికో లేక సోషల్‌మీడియా గుర్తింపు కోసమో చేయడం లేదు' అంటున్నాడు సైన్సు గ్రాడ్యుయేట్‌ అయిన హర్ష్‌ శుక్లా.
 

ఏక్‌ నయీహ్  ఫౌండేషన్‌ ఇలా..
కమలేశ్వర్‌ ఘాట్‌ వద్ద ఏడు సంవత్సరాలుగా నితిన్‌, అతని బృందం సుమారు 200 మంది విద్యార్థులకు ట్యూషన్‌లు చెబుతున్నారు. అంతేకాదు కొందరికి పాఠశాల ఫీజులూ చెల్లిస్తున్నారు. '8వ తరగతిలో ఇక్కడ చేరా. ఇంగ్లీష్‌, హిందీ, గణితంలోని మెలకువలను నేర్చుకున్నా. ప్రస్తుతం మా ఊరిలో నాతోపాటు మరో నలుగురు మాత్రమే 8వ తరగతి పైన చదివినవారు ఉన్నారు. మా గ్రామంలో హయ్యర్‌ సెకండరీ పాఠశాల లేదు. ఫీజులు చెల్లించి, చదివించే స్థోమత లేనందున మా తల్లిదండ్రులు మమ్మల్ని వేరే ఊరికి పంపడానికి ఇష్టపడటం లేదు. అప్పుడు నితిన్‌ మా ఫీజులు చెల్లిస్తామని మాట ఇచ్చి, మమ్మల్ని చదివిస్తున్నాడు' అంటోంది ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న మానసి నిసార్‌. '2018లో పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం పొందేందుకు 'ఏక్‌ నయీV్‌ా ఫౌండేషన్‌'ను స్థాపించాను. కోవిడ్‌కు ముందు ఘాట్‌ దగ్గర బహిరంగ ప్రదేశాల్లో ట్యూషన్‌లు చెబుతుంటే విరాళాలు వాటంతట అవి వచ్చేవి. ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా ఒక గదిలో ట్యూషన్‌ నడుపుతున్నందున విరాళాలు పెద్దగా రావడం లేదు. ప్రస్తుతం మానసి విద్యకు నిధులు సేకరించడం నా ముందున్న పెద్ద సవాలు. ఎందుకంటే ఆ ఊరిలో ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చినా మిగతా తల్లిదండ్రుల్లో మార్పు వస్తుంది. మరికొంత మందిని చదివించడానికి ముందుకు వస్తారు అనేది నా అభిప్రాయం' అంటున్నాడు నితిన్‌.

నితిన్‌కు ఆర్థిక సాయం అందించాలని అనుకునేవారు గూగుల్‌ పే నెంబర్‌
6389007700 లేదా
బ్యాంక్‌ పేరు - SBI P.P.N మార్కెట్‌ 96/12 పరేడ్‌ కాన్పూర్‌ నగర్‌
A/C పేరు - EK NAYEE RAAH ఫౌండేషన్‌
A/C సంఖ్య. - 39083989906
IFSC : SBIN0001784 మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు.