ప్రజాశక్తి-అనంతపురం నిరుపేద కుటుంబం నుంచి వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసిన మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం సేవలు మరువలేనివని జెఎన్‌టియు రిజిస్ట్రార్ సి.శశిధర్ కొనియాడారు. అబ్దుల్‌కలాం జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జెఎన్‌టియు విశ్వ విద్యాలయంలోని పరిపాలనా భవనంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి భారత రాష్ట్రపతిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఇండియా రక్షణ, పరిశోధన రంగంలో ఆయన కృషి మరవలేనిదని, రాష్ట్రపతిగా భావితరాలు ఉజ్వల పథంలో పయనించేలా ఎన్నో స్పూర్తి సందేశాలను అందించారని గుర్తు చేశారు. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశోధకుడిగా ముందుకు సాగినప్పుడే దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమన్నారు. దేశ శాంతి, సమాజ హితమే అభ్యుదయ మంత్రంగా భావించి తన జీవితాన్ని విద్యార్థులతోనే కడదాకా గడిపిన మహోన్నత వ్యక్తి కలాం అన్నారు. 'కలలు కనండి.. సాకారం చేసుకోండి' అని యువతను మేలుకొల్పి అందరి చేత ది మిస్సైల్ మ్యాన్ అఫ్ ఇండియాగా పిలువబడ్డారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణకాంతి, డైరెక్టర్లు జి.వి.సుబ్బారెడ్డి, ఎ.సురేష్‌బాబు, ఓటిపిఆర్‌ఐ డైరెక్టర్ బి.దుర్గాప్రసాద్, డి.విష్ణువర్ధన్, ఎం.రామశేఖరరెడ్డి, మాజీ ఆచార్యులు వి.శంకర్, డిప్యూటీ రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి, రిజిస్ట్రార్ పి.ఎ.ఎ.సాయిమనీష్, సెక్యూరిటీ హెడ్ ఎస్.వెంకటేష్, బోధన, బోధనేతర, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
అబ్దుల్ కలామ్‌కు నివాళులర్పిస్తున్న జెఎన్‌టియు రిజిస్ట్రార్, సిబ్బంది










