Oct 16,2023 00:58
బాపట్లలో కలాం విగ్రహానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం జీవితం నేటి యువతకు ఆదర్శం కావాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మదన్మోహన్‌ చెట్టి అన్నారు. ఆదివారం అబ్దుల్‌ కలాం 92వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చెట్టి మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్‌ కలాం మానవీయ విలువలను పుణికి పుచ్చుకున్న మహామనిషి అని అన్నారు. కరుణ, దయ, అహింస వంటి విలువలకు ఆయన ప్రతిరూపం. నీతి నిజాయితీలకు, నిస్వార్ధతకు ఆయన మారుపేరు. ఆయన నిరాడంబరత అద్వితీయమైనది. దేశభక్తి అపురూపమైనది. దేశం కోసమే తన సర్వస్వాన్ని వెచ్చించిన మహనీయుడని కొనియాడారు. కలాం పేపర్‌ బారుగా జీవితాన్ని ప్రారంభించి, క్షిపణి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఉన్నతమైన స్థానాలను చేరుకున్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు, వెంకటేశ్వర్లు, సుబ్రమణ్యం, నర్రా సాంబు, సురేష్‌, లక్ష్మి పాల్గొన్నారు.
కలాం ఆశయాలకు పునరంకితమవుదాం
ఏపీజే అబ్దుల్‌ కలాం 93వ జయంతి సందర్భంగా బీసీ సంఘాల బాపట్ల జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం బాపట్ల మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద అబ్దుల్‌ కలాం విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కలాం ఆశయ సాధనకు పునరంకితమవు తామని సమాజ్‌వాది పార్టీ బాపట్ల జిల్లా శాఖ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గొర్ల శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో..
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బాపట్లలో కలాం విగ్రహానికి ఆ పార్టీ నాయకులు ఆదివారం నివాళులర్పించారు. భావితరాలకు కలాం స్ఫూర్తిదాయకం కావాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ అధ్యక్షులు పఠాన్‌ రాజేష్‌, దోనేపూడి రవి, నక్కల రాంబాబు, గాంధీ, శీలం సాగర్‌, తాజుద్దీన్‌, రేణుక, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.