
అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శం
- సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి
ప్రజాశక్తి - నంద్యాల
'కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కషి చేయండి' అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచిన భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శమని సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని పింగళి సూరన శాఖా గ్రంథాలయంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి కవులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 'స్ఫూర్తిదాయకం-డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం' అంశంపై చర్చ నిర్వహించారు. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సాహితీ స్రవంతి ద్వారా సాహిత్య కార్యక్రమాలను విస్తతం చేయనున్నట్లు తెలిపారు. మహానంది ఎంఇఒ రామసుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థులకు, పరిశోధకులకు నిరంతరం ఉత్తేజకరమైన సూచనలు, సలహాలు ఇస్తూ మార్గదర్శకంగా నిలిచిన అబ్దుల్ కలాం జన్మదినం ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. తెలుగు పండిట్ అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుఊ అనేక రచనల ద్వారా విద్యార్థులను, యువతను విజ్ఞాన పథం వైపు నడిపించిన కలాం స్ఫూర్తితో సాహితీవేత్తలు మంచి రచనలతో సమాజాన్ని ప్రగతి వైపు నడపాలని కోరారు. సాహితీ స్రవంతి కార్యదర్శి మాదాల శ్రీనివాసులు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించడానికి అందరూ కృషి చేసినప్పుడే కలాం ఆశయాలు నెరవేరుతాయన్నారు. కవులు నరేంద్ర, కొప్పుల ప్రసాద్ నీలకంఠమాచారి, మాబు బాషా, నీలం వెంకటేశ్వర్లు, రఫి తదితరులు విద్యార్థి దినోత్సవం సందర్భంగా కవితలు వినిపించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ నుండి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా ప్రమోషన్ పొందిన మరియదాస్‌ను సాహితీ స్రవంతి సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి శ్రీధర్, భాషోపాధ్యాయ సంస్థ కార్యదర్శి కన్నయ్య, ఎన్జీవో సంఘమ అధ్యక్షుడు మణి శేఖర్ రెడ్డి, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు. బనగానపల్లె : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూత్రాలు ప్రపంచానికి ఆదర్శమని జెకెఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జెఎస్‌ఎస్ బ్రహ్మానంద ఆచారి పేర్కొన్నారు. మండలంలోని పలుకూరు గ్రామంలో జెకెఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక యూనివర్సిటీకి గానీ, ఒక జిల్లాకు గానీ ఆయన పేరు పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాల హనుమంతు, భాస్కర్, పుల్లయ్య, రసూల్ భాష తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : భారత రత్న అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఆపుస్మా నంద్యాల డివిజన్ అధ్యక్షులు అమీర్ బాష ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఉపాధ్యాయులు రామకృష్ణ, మునికుమార్, నరసింహ తధితరులు పాల్గొన్నారు.