Feb 06,2023 23:05

బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి

ప్రజాశక్తి- కొత్తపట్నం : బకింగ్‌ హామ్‌ కెనాల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులపై టిడిపి నాయకులు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని, అబద్ధాలు మాని వాస్తవాలు మాట్లాడాలని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఒంగోలు- కొత్తపట్నం రహదారిలో బకింగ్‌ హామ్‌ కెనాల్‌పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ టిడిపి హయాంలో 2015 నుంచి 2019 వరకూ బ్రిడ్జి నిర్మాణ పనులు 40 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. అందుకుగానూ రూ.8.14 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అయితే 80 శాతం పనులు టిడిపి ప్రభుత్వ హయాంలో పూర్తి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. నిజాలు మాట్లాడే అలవాటు వారికి లేదన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడున్నర సంవత్సరాలలో రూ.9.20 కోట్లు ఖర్చు చేసి 60 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్‌గా కావాల్సిన మెటీరియల్‌ను చీమకుర్తి నుంచి తానే ఇప్పించానని ఈ సందర్భంగా బాలినేని గుర్తు చేశారు. కాంట్రాక్టర్‌ వల్ల పనుల నిర్మాణంలో ఆలస్యం అయితే తమపై నిందలు వేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జికి సంబంధించి నిధులను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులు బరాయిస్తున్నట్లు ఆయనతెలిపారు. అండ్‌బి ఎస్‌ఇ కె.జయరత్నం మాట్లాడుతూ ఆగస్టు 31, 2016న అగ్రిమెంట్‌ చేసినట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం 2018 నాటికి పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌దేనని తెలిపారు. అయితే డిజైన్‌ మార్పు కారణంగా కాంట్రాక్టర్‌ పనులు ఆలస్యం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌సిఆర్‌ఎంపి నిధులను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ బ్రిడ్జికి రూ.14 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్‌ చేసినట్లు తెలిపారు. డిజైన్‌ మార్పు కారణంగా అదనంగా రూ.6 కోట్లు కలిపి ఈ బ్రిడ్జికి రూ. 20.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 2019 తర్వాత రూ. 9.50 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌ ఉండగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి కాంట్రాక్టర్‌ను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. జిఎస్‌బి(గ్రాండ్‌ లెవెల్‌ సబ్‌ బేస్‌) చేశామని దీనిపై వెట్‌ మిక్స్‌ వేసి 15 రోజుల్లో బ్రిడ్జిపై రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్‌ గంగాడ సుజాత, కొత్తపట్నం ఎంపిపి లంకపోతు అంజిరెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రారెడ్డి, జడ్‌పిటిసి సైకం శారద, సర్పంచులు, ఎంపిటిసిలు, తహశీల్దారు బివి.రమణారావు, ఎంపిడిఒ సుజాత పాల్గొన్నారు.