Sep 06,2023 21:51

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : పచ్చి అబద్దాలతో మాయమాటలు చెబుతూ తప్పించుకోవాలని ఎన్నికల కమిషన్‌ ఆఫీస్‌ ముందు పేర్ని నానీ అంకెల గారడి చేస్తున్నాడని మాజీ మంత్రి టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. బుధవారం రవీంద్ర నివాసంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బందరులో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని సాక్షాత్తు న్యాయస్థానమే దర్యాప్తుకి ఆదేశిస్తే ఇంకా తెలుగుదేశం మీద బురద చల్లాలనే ధోరణిలో పేర్ని నాని సోది చెబుతున్నాడని విమర్శించారు.బందర్‌ లో ఏడవలేక ఎన్నికల కమిషన్‌ ఆఫీసుకు పోయి మీడియా మీద అక్కసు వెళ్లగకక్కుతున్నడని ఎద్దేవా చేశారు. పేర్ని నాని నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫీస్‌ దగ్గర పై ప్రెస్‌ మీట్‌ పెట్టాల్సిన అవసరం లేదు బందరులో నేను చర్చకు సిద్ధం మీరు చేసిన అవినీతి అక్రమాల చిట్టాతో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి మేము సిద్దం మీరు సిద్ధమేనా చెప్పాలన్నారు. మీ అవినీతి చిట్టా బయట పెట్టడానికి మా బూత్‌ స్థాయి ఏజెంట్‌ చాలు అన్నారు.తప్పుచేసి పబ్లిక్‌ గా దొరికిపోయి ఓటర్ల జాబితా సవరణలో ప్రజలు నీ బాగోతాన్ని తెలుసుకుంటే ఇంకా ఏదో ప్రజల్ని మభ్యపెట్టి మసిపూసి మారేడు కాయ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నవని విమర్శించారు. నువ్వు చేసిన అక్రమాలు నీకు సహక రించిన అధికారులు అందరికీ తగిన బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది సిద్ధంగా ఉండు అని హెచ్చరించారు.
ఏపీ పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
కొంత మంది ఏపీ పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులా మారిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.భీమవరం బేతపూడిలో లోకేష్‌ యువ గళం పాదయాత్ర పై వైసీపీ మూకలు పోలీసులతో కలిసి చేసిన దాడిని నిరసిస్తు బుధవారం రవీంద్ర నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొంత మంది కాసుల కోసం పోస్టింగుల కోసం ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడలేని అటువంటి పోలీసులకు పోలీసులుగా కొనసాగే అర్హత లేదన్నారు. ఈ ఘటన పై రాష్ట్ర డిజిపి సమాధానం చెప్పాలన్నారు.