ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి/సత్తెనపల్లి రూరల్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అబద్ధాలు చెప్పి, అక్రమాలు చేసి అధికారంలోకి వచ్చారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. వైఎస్ వివేక హత్య, కోడికత్తి కేసుల్లో తనపై లేనిపోని ఆరోపణలు చేసిన జగన్ ప్రజల నుంచి సానుభూతి పొందారని, పింక్ డైమండ్ తన ఇంట్లో ఉందని జగన్ తప్పుడు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందారని అన్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు ఇప్పుడు తెలుస్తున్నాయని అన్నారు. వివేకా హత్యపై సొంత చెల్లి వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. కోడి కత్తి డ్రామా ఆడిన జగన్‌పై ఎన్‌ఐఎ స్పష్టంగా చెప్పారని, ఆ కేసులో నిందితుడికి టిడిపికి సంబంధం లేదని దర్యాప్తు సంస్థ అధికారులు తేల్చారని అన్నారు. ఉద్యోగులకు తాను 42 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే జగన్ 23 శాతం ఇచ్చారని చెప్పారు. పట్టణాల్లో ఆస్తిపన్ను ఏటా 15 శాతం పెంచుతున్నారని, తాను ఇసుక ఉచితంగా ఇస్తే ఇప్పుడు ట్రాక్టర్ రూ.5 వేలకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. విద్యాదీవెన, వసతి దీవెన బోగస్ అన్నారు. టిడిపి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ 16 లక్షల మందికి ఇస్తే, ఇప్పుడు 10 లక్షల మందికే ఇస్తున్నారని అన్నారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణలలో పిజీ చదివే వారి సంఖ్యపెరిగితే మన రాష్ట్రంలో తగ్గిందని చెప్పారు. పీజీ చెయ్యడానికి మన రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది తెలంగాణకు వెళ్లారని తెలిపారు. విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృత వంటి యూనివర్సిటీలను, మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకువచ్చానని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కేంద్ర విద్యాసంస్థలు తీసుకువచ్చామన్నారు. జగన్ నొక్కేది ఉత్తుత్తి బటన్.. ట్యాంకర్ లో నీళ్లు ఉంటే ట్యాప్‌లో నీళ్లు వస్తాయి.. అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు తేవడం గొప్పకాదు.. అని విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది సాగర్ నీరు ఈ ప్రాంతానికి ఇవ్వలేదని, తాను కట్టిన పట్టిసీమ వల్ల పంటలకు నీటి ఎద్దడి లేకుండా చేశానని అన్నారు. నీళ్లడిగిన రైతులపై నరసారావుపేటలో అక్రమ కేసులు పెట్టారని, టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులను ఎత్తేస్తామని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. సత్తెనపల్లిలో స్థానికంగా రైల్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉందని, దాన్ని నిర్మించలేకపోయారని అన్నారు. పేరేచర్ల, సత్తెనపల్లి రోడ్డు అధ్వాన్నంగా ఉందని, ఆ రోడ్డు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సత్తెనపల్లి పట్టణంలో డ్రెయినేజ్ పనికి వెళ్లి యువకుడు చనిపోతే అతనికి వచ్చిన రూ.5 లక్షల ఆర్థిక సాయంలో మంత్రికి కమీషన్ ఇవ్వనందుకు చెక్కును అందించలేదని, పేదల ఇళ్ల స్థలాల్లో అంబటి మనుషులు రూ.10 కోట్లు కొట్టేశారని, కమీషన్ ఇవ్వలేదని ముగ్గు మిల్లులు మూసేశారని ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉండగా సభకు టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.










