ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని, వీటితో సత్వర న్యాయ పరిష్కారం లభిస్తుందని నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి లీలావతి కోరారు. స్థానిక న్యాయస్ధానాల సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏళ్ల తరబడి కోర్టులకు తిరగకుండా రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. లోక్ అదాలత్‌లో కేసు ఒక్కసారి రాజీ అయితే అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్ కేసులు న్యాయపరంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఎటువంటి ఖర్చులు లేకుండా కాలం వృథా కాకుండా ఇవి దోహదపడతాయని తెలిపారు.చిన్న చిన్న కేసులు కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్న పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మధు సూధనావు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.










