Feb 24,2023 23:38

గిరిజనుల నుండి వినతలు స్వీకరిస్తున్న పిఒ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఐటిడిఎలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు వినతలు వెల్లు వెత్తాయి. ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ, జెసి జె.శివ శ్రీనివాసు, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 85 వినతులు స్వీకరించారు. రెవెన్యూ విభాగానికి భూ సమస్యలు పరిష్కరించాలని 16 వినతలను అర్జీదారులు సమర్పించారు. సామాజిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, తాగునీటి సదుపాయాలు, రోడ్డు సౌకర్యాలు వంటి అంశాలపై 69 ఫిర్యాదులు అందాయి. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పిఒ అదేశించారు.
స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులు
చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామస్తులు బి.రమణమ్మ, బి.కొండమ్మ, కె.బాలయ్య తదితర పివిజిటిలు 2020లో తమ ఆధీనంలో ఉన్న అటవీ భూములపై సర్వే చేసారని, అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. జికె.వీధి మండలం దేవరాపల్లి పంచాయతీ మెట్టగూడ గ్రామస్తులు జి.కామేశ్వరరావు, జి.రాజు, పి.రవి తదితరులు లక్కవరం నుండి మెట్టగూడ వరకు రోడ్డు నిర్మించాలని, గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అరకు వేలీ మండలం చినలబుడు పంచాయతీ మాలిసింగారం గ్రామస్తుడు ఎం.దాసు అరకు రైల్వే ఇంజనీరింగ్‌ ఆఫీసు ఎదురుగా ఉన్న ఐటిడిఎ దుకాణ సముదాయంలో దుకాణం కేటాయిస్తే రైతులకు ఉపయోగపడే విధంగా విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు షాపు పెడతానని వినతిపత్రంలో పేర్కొన్నారు. పెదబయలు మండలంకు చెందిన పి.ప్రసాదు పాడేరు నుండి విశాఖపట్నం రహదారిలో మోదకొండమ్మ అమ్మవారి పాదాల నుండి గరికిబంద వరకు ఘాట్‌ రోడ్డులో రక్షణ గోడలు నిర్మించాలని కోరారు. హుకుంపేట మండలం ములియాపుట్టు గ్రామంలో జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు రూ. 7 లక్షలతో తాగునీటి పథకం నిర్మించారని తగిన నాణ్యతలు పాటించలేదని గ్రామస్తులు కె.రామస్వామి, ఎస్‌.గంగాధర్‌, ఆర్‌.బుజ్జిబాబు ఫిర్యాదు చేసారు. జికె వీధి మండలం దేవరాపల్లి పంచాయతీ జెర్రెల బంద బుగ్గలోని గ్రామానికి ఈత రొబ్బలు గ్రామం నుండి మూడున్నర కిలో మీటర్ల రోడ్డు నిర్మించాలని జి.అశోక్‌, కె.బాబు వినతి పత్రం సమర్పించారు. ముంచింగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ దాసంపుట్టు గ్రామం నుండి జర్రెల గ్రామం వరకు మిషన్‌ కనెక్ట్‌ పాడేరులో రోడ్డు మంజూరు చేసారని పనులు ప్రారంభించాలని సర్పంచ్‌ నాయకం భాగవతి కోరారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ ఐ.కొండలరావు, ఇఇ డివిఆర్‌ఎం రాజు, డిఎంహెచ్‌ఒ డా.జమాల్‌ భాషా, పిఆర్‌ పిఐయు ఇఇ కె.లావణ్య కుమార్‌, డిఎల్‌ పిఒ పిఎస్‌ కుమార్‌, జిల్లా ఉద్యాన వన అధికారి రమేష్‌ కుమార్‌ రావు, ఐసిడిఎస్‌ పిడి సూర్యలక్ష్మి, ఆర్‌ అండ్‌ బి ఇఇ బాలసుందర బాబు పాల్గొన్నారు.