
న్యూఢిల్లీ : 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య అధార్ ప్రస్తుతం భారతదేశంలో వ్యక్తుల కార్యకలాపాల్లో ముఖ్య భాగమైపోయింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్ధ యుఐడిఏఐ జారీచేసే ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన వేలిముద్రలతోపాటు, వ్యక్తిగత సమాచారం ఇందులో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఇప్పటికే రేషన్ కార్డు మొదలు, ఆర్ధిక కార్యకలపాలు, సంక్షేమం, ఉపాధి ఇతర అన్ని కార్యకలాపాలకు అధార్‌ను ప్రామాణికంగా భావిస్తుండగా భవిష్యత్తులో ఓటర్ గుర్తింపు కార్డును అధార్‌తో అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిపై లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు సాజ్దా అహ్మద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇస్తూ.. ఇప్పటికే లా కమిషన్ పరిశీలన పూర్తయిందని, త్వరలోనే అనుసంధాన ప్రక్రియపై కసరత్తు ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. బోగస్ ఓటర్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఇసిఐ) ప్రతిపాదించిన ఓటర్ కార్డు-ఆధార్ అనుసంధానం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఇసిఐ ప్రతిపాదించిందని తెలిపారు.
ఓటరు కార్డుకు అధార్ లింక్ కారణంగా దొంగ ఓట్ల బెడదను నిరోధించటంతోపాటు, ఒక వ్యక్తి ఒక ప్రాంతంలోనే తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల్లో ఓటుహక్కును వినియోగించుకోవటానికి ప్రయత్నిస్తే వెంటనే సాంకేతికత అందుకు ఎట్టిపరిస్ధితుల్లో అనుమతించదు. ఎన్నికల సంఘం సైతం ఓటర్ కార్డును అధార్‌తో అనుసంధానించాలమంటూ గతంలోనే ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా.. ఓటర్ కార్డును అధార్‌తో అనుసంధానం చేసిన పక్షంలో డేటా దుర్వినియోగం కాకుండా ఎలక్టోరల్ డేటా ఫ్లాట్ ఫామ్ భద్రత కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది. ఎలక్టోరల్ రోల్ డేటాబేస్ సిస్టమ్ అధార్ ఎకో సిస్టమ్‌లోకి ప్రవేశించదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఓటరు కార్డును అధార్‌తో అనుసంధానించటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత డేటాను రక్షించేందుకు ప్రత్యేక చట్టం లేకపోటంతోపాటు, డేటా మొత్తం బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉండటం, ఇష్టం వచ్చినట్లు ఓటర్లను తొలగించే పరిస్ధితులు కూడా ఉత్పన్నం అవుతాయన్న ఆందోళన వ్యక్తమౌతుంది.
జమిలి ఎన్నికలతో వ్యయభారం తగ్గుతుంది..
జమిలీ ఎన్నికలకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసిందని మరో ఎంపి ప్రదీపకుమార్ సింగ్ అడిగిన ఓ ప్రశ్నకు కిరెణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,814 కోట్ల నిధులను విడుదల చేసిందని వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగే జమిలీ ఎన్నికలతో ఆ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని పేర్కొన్నారు.