'ఈ ప్రకృతంతా పరచుకున్న/ పచ్చని రూపాన్ని నేను/ ప్రకృతిలో ప్రధానమైన/ సృష్టికే మూల రూపాన్ని నేను' అంటారు కవయిత్రి డాక్టర్ వాసా ప్రభావతి. తరతరాల చరిత్రలో, మానవ వికాసంలో శారీరకంగానూ, మానసికంగానూ పురుషునితో సమానమైన స్త్రీని, పురుషునికన్నా ప్రాముఖ్యత గల పాత్ర పోషించిన స్త్రీని, అనేక విధాల అణచివేతకు గురిచేసిన సమాజం... స్త్రీని బానిసను చేసింది. నాగరికత పేరుతో విష సంస్కృతి ఒకవైపు, భారతీయ సంప్రదాయం పేరిట చెప్పబడుతున్న ఛాందస, మత మౌఢ్య సంస్కృతి మరొకవైపు... స్త్రీని భోగ వస్తువుగా మార్చింది. 'స్త్రీ ఒక అలంకార వస్తువు/ పురుషుని ఆస్తిపాస్తులలో ఒక భాగం/ పిల్లల్ని కనే యంత్రం/ స్వేచ్ఛ ఇవ్వగూడని మానవ మృగం/ లైంగికావసరాలను తీర్చే సాధనం స్త్రీ' అంటారు మరో కవయిత్రి షాజహానా. ఆమెకు స్వేచ్ఛా సమానత్వం లేదు. తన అభిప్రాయాన్ని చెప్పే స్వాతంత్య్రం లేదు. మనిషి జీవితంలో వివాహం ముఖ్యమైన ఘట్టం. ఇలాంటి సందర్భంలోనూ తన అభిప్రాయానికి విలువలేదు. సాధికారత అంతకన్నా లేదు. అమ్మాయిల వివాహ కనీస వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే... ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. తనకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే కనీస హక్కును కూడా... తన నియంతృత్వ నిర్ణయంతో కాలరాయబూనుకున్నది. వివాహ వయో పరిమితిని నిర్ణయించడానికి వ్యక్తిగత, సమూహాల, అభిరుచులు, సంప్రదాయాలు, ఇష్టాలు, సెంటిమెంట్లు అన్నీ పరిగణనలోకి తీసుకోవాలని 'పర్సనల్ లా' చెబుతుంది. అవేమీలేకుండా హఠాత్తుగా ఓ ప్రకటన చేసి, బిల్లు పెట్టేస్తామని చెప్పడం అనుచితం. ఒకవైపు మూఢ విశ్వాసాల, మనువాద సాంప్రదాయాల ప్రచారంతో ఆడవారిని అణగదొక్కుతూ, మరోవైపు వివాహ వయోపరిమితిలో సమాన ధర్మం పాటించాలనడం కపట నాటకం కాదా?
దాదాపు గత శతాబ్ద కాలాన్ని పరిశీలిస్తే... యువజనుల్లో రెండేళ్లు ముందుగానే యుక్తవయస్సు వచ్చేస్తోంది. దీనికి కారణం... తీసుకునే ఆహారంలో, జీవన పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడం. అదే సమయంలో జీవన ప్రమాణం పెరుగుతోంది. గతంలో యుక్తవయస్సు వచ్చేనాటికే యువకులు జీవితంలో స్థిరపడేవారు. చేతివృత్తులు, వ్యవసాయం...తదితర వృత్తుల్లో వుండే యువకులు 16ఏళ్ల నాటికే తమకాళ్లపై తాము నిలబడే శక్తి వచ్చేది. ఇప్పుడు ఆ శక్తి రావడం ఆలస్యమౌతోంది. చదువుకునే కాలం పెరిగింది. ఉద్యోగం రావడానికీ సమయం పడుతోంది. అంటే.... ప్రస్తుతం యువకులు సొంత కాళ్లపై నిలబడటానికి ఎక్కువ సమయం పడుతోంది. అటు తక్కువ వయస్సులోనే యవ్వనులవుతున్నారు. దీనివల్ల శారీరకంగా, మానసికంగా, వాంఛలపరంగా యువతలో ఒత్తిడి పెరుగుతోంది. సమాజంలో పెరిగిన విచ్చలవిడితనం, స్త్రీని వినియోగ వస్తువుగా చూడటం, పెరుగుతున్న పురుషాధిక్యత వంటివి దీనికి తోడ్పడుతున్నాయి. ఈ వైపరీత్యాల నుంచి నవతరాలను పరిరక్షించుకోవడం సమాజం బాధ్యత.
ఒకవైపు 33 శాతం రిజర్వేషన్ కావాలన్న డిమాండ్‌ను నిర్లక్ష్యం చేసి, మరోవైపు ఈ అయోమయ బిల్లు తెచ్చే ప్రయత్నం ఎవరిని నమ్మించడానికి? మహిళా సాధికారత, సమాన కూలి, ఉపాధి కల్పన, వంటివి పక్కన పెట్టి, తెచ్చే సమానత్వం విలువ ఏమిటి? మహిళలు కోరుకునే సమానత్వం ఇది కాదు. అమ్మాయిలకు విద్యనందించడం సమానత్వంలో కీలకమైన మెట్టు. విద్యను వ్యాపారంగా మార్చిన తర్వాత ఎక్కువగా నష్టపోతున్నది ఆడపిల్లలే. కూలి దగ్గరా సమానత్వం లేదు... చట్టసభల్లోనూ లేదు. సమాజంలో భద్రత లేదు. మృగాళ్ల నుంచి రక్షణ లేదు. డ్రెస్ కోడ్ విధించడం, వాలెంటైన్స్ డే పేరుతో, సంస్కృతి పేరుతో అమ్మాయిలపై దాడులు చేస్తూ, సడన్‌గా సమానత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా వుంది. ఇది దెయ్యాలు వేదాలు వల్లించడమే. దీని వెనుకనున్న రాజకీయ ప్రయోజనాలేమిటన్నది దేశ ప్రజలకు సరిగ్గానే అర్ధమవుతుంది. ఎవరైనా ఒక్కసారి మోసపోతారు తప్ప ప్రతిసారీ మోసపోరు. అందుకే దేశవ్యాప్తంగా మహిళలు, మహిళా సంఘాలు, అభ్యుదయవాదులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. వివాహ వయో పరిమితి పెంచాలన్న కేంద్ర నిర్ణయం అనాలోచితం! అనుచితం!! అసందర్భం!!!










