5 రోజుల్లో 68 కొత్త కేసులు
హరారే : జింబాబ్వేలో కలరా వ్యాధి ప్రబలుతోంది. నవంబర్ మొదటి ఐదు రోజులలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి, దేశ రాజధాని హరారేకి దక్షిణాన ఉన్న చిటుంగ్విజా అనే డార్మిటరీ పట్టణం కలరా హాట్‌స్పాట్‌లలో ఒకటి. 3,71,000 దాకా జనాభా ఉన్న ఈ పట్టణం హెల్త్ ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. అధికారిక సమాచారం ప్రకారం, ఐదు రోజులలో 137 అనుమానిత కేసులు, 28 ధ్రువీకరించబడిన కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని హరారేలో 51 అనుమానిత కేసుల్లో తొమ్మిది నిర్ధారణ అయ్యాయి. హరారే మాదిరిగానే, చిటుంగ్‌విజా పట్టణం తీవ్ర తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. మురుగు పైపుల లీకేజీల వల్ల తరచూ భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి.ఆదివారం నాటికి, జింబాబ్వే మొత్తం మీద 6,486 అనుమానిత కలరా కేసులు నమోదు కాగా, 1,127 కేసులు నిర్ధారణ అయ్యాయి. 44 మంది కలరాతో చనిపోయారు. మరో 137 మరణాలు కలరా వల్ల సంభవించినవేనని అనుమానిస్తున్నారు. తూర్పు జింబాబ్వేలోని మణికాలాండ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 694 నిర్ధారణ అయిన కేసులు నమోదయ్యాయి. 23 మరణాలు చోటుచేసుకున్నాయి.సమాచార,ప్రసార శాఖ మంత్రి జెన్‌ఫాన్ ముస్వెరే మీడియాతో మాట్లాడుతూ, పేలవమైన పారిశుధ్యం ,సురక్షితమైన నీటిని సరిపడా అందించకపోవడం కలరా ప్రబలడానికి కారణంగా పేర్కొన్నారు.