Jul 29,2023 15:29

హైదరాబాద్‌ : భార్యను హత్య చేసిన కేసులో యూత్‌ కాంగ్రెస్‌ లీడర్‌ను హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట గుండెపోటుతో భార్య చనిపోయిందని నమ్మించేందుకు భర్త యత్నించాడు. కానీ పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమెది హత్యే అని తేలింది.వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ లీడర్‌ రంగసాయి రెడ్డి కుమారుడు వల్లభ్‌ రెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ లీడర్‌గా కొనసాగుతున్నాడు. అయితే వల్లభ్‌ రెడ్డికి ఏడాది క్రితం లహరి అనే అమ్మాయితో వివాహమైంది. వల్లభ్‌, లహరి కలిసి హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.జులై 14వ తేదీన లహరి తలకు గాయమైందని సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే లహరి గుండెపోటుతో చనిపోయిందని ఆమె తల్లిదండ్రులను వల్లభ్‌ నమ్మించే ప్రయత్నం చేశాడు. లహరి తండ్రికి అనుమానం రావడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.లహరి గుండెపోటుతో చనిపోలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె తలకు తీవ్ర గాయం కావడంతోనే చనిపోయిందని, కడుపు లోపల కూడా తీవ్ర గాయాలయ్యాయని తేలింది. జులై 13వ తేదీన లహరి, వల్లభ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అదే రోజు ఆమె తలను గోడకేసి కొట్టడంతో బలమైన గాయాలైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో వల్లభ్‌ను కఠినంగా శిక్షించాలని లహరి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.