Oct 30,2023 08:28

ఎంతకని వుంచుకుంటావు
ఇంకా ఇంకా ఎందాకని విస్తరిస్తావు
నువ్వేమైనా అడవివా, అల్లుకుపోవటానికి
మనిషివే కదా!

నీకెంత జాగా కావాలి?
ఆకాశాన్నీ భూమినీ ఆక్రమించినా
నీకు చివరికి మిగిలేది
ఆరడుగుల నేలే కదా!
ఆ విషయం ఎందుకు మరుస్తావు నువ్వు?

పసిమొగ్గల్ని, పచ్చనాకుల్ని
పూలవనాల్ని, పున్నమి వెన్నెలల్నీ
తెంపేసి నువ్వు బావుకునేదేముంది?

ఎవరి జాగా వాళ్లకివ్వకూడదా
ఎవరి బతుకును వాళ్లను
బతుకనివ్వకూడదా?
చంపేసుకుంటూ ఎంత దూరం పోతావు?
బాంబులు విసురుకుంటూ
బతుకుల్ని కూల్చుకుంటూ
మహా అయితే నువ్వేం సృష్టించగలవు
ఒట్టి శవాల దిబ్బలు తప్ప !

ఊళ్లకు ఊళ్లను శ్మశాన మైదానాల్లా మార్చి
నువ్వు పరిపాలించేదేముంటుందిక
పరిపాలించటానికి ప్రజలుండాలి కదా!
మనుషులు బతికుండే ఓ నేల కావాలి కదా
నువ్వూ మనిషివేననే సంగతి మరిచిపోతే ఎట్లా ?

బతుకుల్ని నేలమట్టం చేసుకుంటూ
పల్లెల్నీ, నగరాల్నీ, పచ్చని ఆవాసాల్నీ
మనుషులు సంచరించే ప్రతి మూలనీ
మట్టిదిబ్బల్లా మార్చుకుంటూ
యుద్ధం కాళ్లకింద
ఎంతకని తొక్కుకుంటూ వెళతావు?
ఎంతకని అంతా నాదేనని విర్రవీగుతావు
ఎందాకని రాజ్యదాహంతో విస్తరిస్తూ పోతావు
చివరికో కప్పెట్టిన మట్టిదిబ్బలానే
నువ్వూ మిగిలిపోతావని
ఎప్పటికి తెలుసుకోగలవు !
- చిత్తలూరి
91338 32246