బుడాపెస్ట్: 100మీ. కొత్త చిరుతగా అమెరికాకు చెందిన నో లైల్స్ నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 100మీ. ఫైనల్లో గమ్యాన్ని 9.83సెకన్లలో చేరి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంతకుముందు 200మీ. పరుగులో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్న లైల్స్‌కు ఇది 100మీ. పరుగులో తొలి స్వర్ణం కావడం విశేషం. ఈ క్రమంలో లెట్సెల్లి టెబోగో(బోట్నానా), జర్నెల్ హ్యూజ్(బ్రిటన్) ఫొటో ఫినిష్‌లో 9.88సెకన్లతో రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. అమెరికా స్ప్రింటర్ ఫ్రెడ్ కర్లె సెమీస్‌లో విఫలమై.. ఫైనల్‌కు చేరలేకపోయాడు. ఇక ఇటలీకి చెందిన ఒలింపిక్ ఛాంపియన్ లామెంట్ మర్సెల్ జాకోబ్స్ 10.05సెకన్లతో చివరిస్థానంలో నిలిచాడు.










