హెల్త్ సెక్రెటరీలపై యాప్ల పని వత్తిడి తగ్గించాలి :జి.ఎస్. రాజేశ్వర రావు
ప్రజాశక్తి-కలెక్టరేట్ :గ్రామ వార్డు సచివాలయం హెల్త్ సెక్రటరీ లపై వివిధ రకాల యాప్ ల పేరుతో జరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఉమ్మడి విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షుడు జి.ఎస్ రాజేశ్వరరావు డిమాండ్ చేశారు.శుక్రవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద గ్రామ వార్డ్ సచివాలయం హెల్త్ సెక్రెటరీ లు మహాధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఇతర శాఖలలో లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖ లో హెల్త్ సెక్రెటరీ లు 47 రకాల యాప్ లు,వాటికి సబంధించి మరో 70 రకాల' ఉప యాప్ లు ఉపయోగిస్తున్నారన్నారు. ఇన్ని యాప్ ల పై పని చేయడం వల్ల వారు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ యాప్ ల పై పని చేయడం వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించ లేని పరిస్థతుల్లో హెల్త్ సెక్రెటరీ లు,మానసిక వత్తిడి కి గురి అవుతున్నారన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. జగన్మోహనరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఈ ఏడాది జనవరి లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హెల్త్ సెక్రెటరీ లు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో మాత్రమే పనిచేయాలని,ఐతే పంచాయితీ రాజ్, జివిఎంసి లాంటి శాఖలు వీరికి వివిధ పనులకు ఉపయోగిస్తున్నారన్నారు. 2500 జనాభా కి ఒక హెల్త్ సెక్రటరీ ఉండేలా చూడాలన్నారు.జూమ్ మీటింగులు పని వేళలో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యవర్గ కార్యదర్శి రాము గ్రామ వార్డు సచివాలయం హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు కె.రత్నం, ప్రధాన కార్యదర్శి ఎ.దేవకి, కార్య నిర్వాహక కార్యదర్శి పరమేశ్వరి,గౌరవ అధ్యక్షురాలు పి.మణి పాల్గొన్నారు.










