
- రొయ్యల వ్యర్థాలతో దుర్గంధం
- వరి పంటపై తీవ్ర ప్రభావం
- చోద్యం చూస్తున్న అధికారులు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగు చేస్తున్నారు. చెన్నైలోని సెంట్రల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సిఎఎ)తో పాటు రాష్ట్ర స్థాయిలో అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత సాగుకు చర్యలు చేపట్టాలి. కాని జిల్లాలో చాలా చోట్ల ఈ నిబంధన అమలు కావట్లేదు. అక్వా సాగులో విడిచిపెట్టే వ్యర్థాల వల్ల వాతావరణ కాలుష్యంతో పాటూ చెరువుల చెంతన ఉన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనధికార సాగుపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 65 వేల ఎకరాల్లో రొయ్యలు, చేపల చెరువుల సాగు జరుగుతుంది. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 34వేల ఎకరాల సాగు జరుగుతుండగా, మిగిలిన 31 వేల ఎకరాలు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో సాగవుతుంది. అనధికారికంగా మరో మూడు వేల ఎకరాలకు పైగా సాగు జరుగుతున్నట్లు సమాచారం. గత ఏడాది ఉప్పలగుప్తం, తాళ్ళరేవు, అమలాపురం ప్రాంతాలలో అనధికార చెరువులను గుర్తించి వంద మందికి పైగా రైతులకు అప్పటి ఉన్నతాధికారి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఈ ఏడాది అనధికారికంగా సాగు చేసే వారి సంఖ్య మరింత పెరగడం ఆందోళనకరమైన విషయం.
అమలుకు నోచుకోని సాగు నిబంధనలు
రొయ్యల చెరువులు సాగు చేసే రైతులు ముందుగా న సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత తహశీల్దార్ మత్య, వ్యవసాయ, వాతా వలన శాఖ అధికారులు మొదట పరిశీలించి నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తారు. అనంతరం జిల్లా కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ నివేదికను కలెక్టర్ అనుమతి కోసం పంపిస్తుంది. కలెక్టర్ అనుమతి ఇచ్చిన తర్వాతనే సాగు చేపట్టాలి. జిల్లాలో వందలాదిమంది రైతులు ఈ నిబంధనలు నీళ్లు వదిలి సాగు చేస్తున్నారు అధికారులు కూడా పర్యవేక్షణ చేయడం లేదు,
కాలుష్యంతో బెంబేలు
ఆక్వా సాగు వల్ల వాతావరణం తీవ్రంగా కాలుష్యమవుతోంది. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలు పలు వ్యాధులతో మంచం పడుతున్నారు. ఉప్పునీటిని ఉపయోగించడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి.
వరి సాగుపై తీవ్ర ప్రభావం
ఆక్వా దుష్ప్రభావాలు వరిపై ఎక్కువగా ఉన్నాయి. రొయ్యల చెరువుల నుంచి విడుదలచేస్తున్న వ్యర్థాలు మురుగు కాలువలు, పంటబోదెల్లోకి విడిచిపెడుతున్నారు. ఫలితంగా వరి పంటలు నాశనమవుతున్నాయి. అంతేకాకుండా మత్స్య సంపద దెబ్బ తింటోంది.