Mar 25,2023 12:54

ప్రజాశక్తి -కోట (తిరుపతి) : పట్టభద్రుల, శాసనసభ్యుల విభాగం శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓటమికి కౌంట్‌ డౌన్‌ మొదలైనట్టేనని తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూపిలి. రాధాకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా శనివారం రాధాకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ .... రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాలలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 11 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్న మూడు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం, శాసనసభ్యుల ద్వారా ఎన్నికయ్యే శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైసిపి అభ్యర్థుల కంటే అధిక ఓట్లతో శాసనమండలికి ఎన్నిక కావడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభ సూచకమని అన్నారు. ఒక్క ఛాన్స్‌ నినాదంతో అమలు సాధ్యంకాని వాగ్దానాలతో ప్రజలను మాయ చేసి అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వ 46 నెలల పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గంవారు కూడా సంతృప్తిగా లేరని అధిక ధరలతో, అవినీతితో, అణచివేత ధోరణితో, ప్రశ్నించే వారిపై ఉక్కు పాదంతో, అప్రజాస్వామిక విధానాలతో, రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో, ప్రభుత్వ ఉన్నతాధికారులు న్యాయస్థానం ఎదుట ముద్దాయిలుగా నిలబడాల్సిన పరిస్థితితో, మహిళలు బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల వారిపై దాడులు దుర్మార్గాలు నిత్యకఅత్యంగా, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు లేకుండా సాగుతున్న అరాచక ఆటవిక వైసిపి పాలన నుండి విముక్తి పొందాలని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వంపై పట్టభద్రుల ద్వారా వైసిపి శాసనసభ్యుల ద్వారా తిరుగుబాటు మొదలైందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో కూడిన మూడు వంతుల ప్రజానీకం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి కి 23 సీట్లు కూడా రాకుండా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని రాధాకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.